చంద్రబాబు, లోకేష్‌లకు లీగల్ నోటీసులు

టీడీపీ అధినేత , మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కు అలాగే ఆయన తనయుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లకు లీగల్ నోటీసులు వెళ్లాయి. సీఎం జగన్ ను సైకో అని వీరు అనడం పట్ల ఏలూరుకు చెందిన హైకోర్టు న్యాయవాది, ఏపీ లాయర్స్‌ ఫ్రంట్‌ అధ్యక్షుడు జి.రోనాల్డ్‌రాజు నోటీసులు పంపారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ముఖ్యమంత్రి జగన్‌ను ‘సైకో’ అని అవమానించడం చట్టవిరుద్ధమని లాయర్ తప్పుబట్టారు. అందుకే చంద్రబాబు, నారా లోకేష్‌కు లీగల్‌ నోటీసులు జారీ చేశారు. వీరిద్దరితో పాటూ కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్‌, కేంద్ర సమాచార శాఖ మంత్రి, ట్విట్టర్‌, ఫేస్‌ బుక్‌, వాట్సాప్‌, యూట్యూబ్‌‌ అధినేతలకు కూడా నోటీసులు పంపారు.

కొద్దీ రోజులుగా సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ‘సైకో పోవాలి.. సైకిల్‌ రావాలి’ అని టీడీపీ నేతలు సీఎం జగన్‌పై వ్యాఖ్యలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని, వాటిని ఆపకపోతే చట్టప్రకారం ముందుకు వెళతామని నోటీసులో ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యలతో రాష్ట్రంలో అశాంతి, అల్లర్లు చెలరేగితే అందుకు చంద్రబాబు, లోకేష్‌లు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం ఈ నోటీసు వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ గా మారింది.