రష్యన్ సైనికులకు అత్యాచారం కూడా ఓ ఆయుధమే

ఐరాసకు తెలిపిన ఉక్రెయిన్ హక్కుల సంఘం

కీవ్: ఉక్రెయిన్ పై దురాక్రమణకు దిగిన రష్యా సేనలు అనేక దారుణాలకు పాల్పడుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా, మహిళలు, బాలికలపై రష్యా సైనికులు అత్యాచారాలకు పాల్పడుతున్నారంటూ ఉక్రెయిన్ వర్గాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా, ఉక్రెయిన్ కు చెందిన లా స్ట్రాడా-ఉక్రెయిన్ అనే మానవ హక్కుల సంఘం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. లా స్ట్రాడా-ఉక్రెయిన్ సంస్థ అధ్యక్షురాలు కాటరీనా చెరెపఖా దీనిపై స్పందిస్తూ, రష్యా సైనికులు 12 మంది ఉక్రెయిన్ మహిళలు, బాలికలపై అత్యాచారాలకు పాల్పడిన 9 ఘటనలు తమ దృష్టికి వచ్చాయని తెలిపారు.

ఇది కేవలం ప్రాథమిక సమాచారం మాత్రమేనని, ఇంకా పెద్ద సంఖ్యలో రష్యన్లు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఉక్రెయిన్ పై యుద్ధంలో రష్యన్ సైనికులు అత్యాచారం చేయడాన్ని ఓ అయుధంగా వాడుకుంటున్నారని విమర్శించారు. ఈ మేరకు ఆమె ఐక్యరాజ్యసమితి అధికారికి తెలియజేశారు. కాటరీనా చెరెపఖాను ఉటంకిస్తూ, రష్యన్ సేనల అత్యాచార పర్వాన్ని ఆ ఐరాస అధికారి భద్రతామండలికి నివేదించారు. కాగా, రష్యా మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చుతోంది. ఉక్రెయిన్ లో తాము సాధారణ పౌరుల జోలికి వెళ్లడంలేదని అంటోంది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/