సర్వదర్శన టోకెన్లకు ఎగబడిన భక్తులు ..పలువురికి గాయాలు

5 రోజుల పాటు బ్రేక్ ద‌ర్శ‌నాలు ర‌ద్దు..

తిరుమల: తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకునేందుకు భ‌క్తులు పోటెత్తారు. ఆది, సోమవారాల్లో టోకెన్లు కేటాయించడం లేదని, మంగళవారం విడుదల చేస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తిరుపతి భూదేవి, శ్రీనివాసం కాంప్లెక్స్, గోవిందరాజస్వామి సత్రాల వద్ద టోకెన్ల పంపిణీని మొదలుపెట్టారు.

ఈ క్రమంలోనే ముందే చాలా మంది భక్తులు ఆయా కేంద్రాలకు పిల్లలతో సహా తరలివచ్చారు. గోవిందరాజస్వామి సత్రం వద్ద భక్తుల తాకిడి మరింత ఎక్కువ కావడంతో టికెట్ల కోసం పోటీ ఏర్పడింది. దీంతో తోపులాట జరిగింది. కొద్దిమంది పోలీసులున్నా, టీటీడీ విజిలెన్స్ అధికారులు చర్యలు తీసుకున్నా కట్టడి చేయలేకపోయారు. ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. వారిని తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. అయితే, టీటీడీ అధికారులు, సిబ్బందిపై భక్తులు తీవ్ర ఆరోపణలు చేశారు. లైన్ లో నిలబడిన వారికి సర్వదర్శనం టోకెన్లను కేటాయించకుండా బ్లాక్ లో అమ్ముకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస వసతులు కల్పించలేదని మండిపడ్డారు.

ఈ ఘటన నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి(బుధవారం) నుంచి ఆదివారం వ‌ర‌కు ఐదు రోజుల పాటు వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నాల‌ను టీటీడీ ర‌ద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. టికెట్లు లేకున్నా శ్రీవారి ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తామ‌ని స్ప‌ష్టం చేసింది. స‌ర్వ‌ద‌ర్శ‌నం టోకెన్లు కూడా పెంచాల‌ని టీటీడీ నిర్ణ‌యించింది. ప్ర‌స్తుతం రోజుకు 30 వేల టోకెన్లు జారీ చేస్తుండ‌గా, ఆ సంఖ్య‌ను 45 వేల‌కు పెంచాల‌ని టీటీడీ నిర్ణ‌యం తీసుకున్న‌ది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని అధికారులు కోరారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/