ఉక్రెయిన్‌కు 6 వేల క్షిపణులు, 25 మిలియన్ పౌండ్ల ఆర్థిక సాయం
రష్యాపై ఆర్థికపరమైన ఆంక్షలు రెట్టింపు చేయాలన్న బోరిస్

లండన్: ఉక్రెయిన్‌పై రష్యా దాడి 29వ రోజుకు చేరింది. రష్యా దాడులను తిప్పికొట్టడంతో ఉక్రెయిన్ ప్రదర్శిస్తోన్న ధైర్యం ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరుస్తోంది. దీంతో రష్యా దాడుల తీవ్రతను పెంచడంతో ఉక్రెయిన్‌కు బ్రిటన్ మరింత సాయం ప్రకటించింది. ఆరు వేల క్షిపణులు, 25 మిలియన్ పౌండ్ల ఆర్థిక సాయం చేస్తామని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు.
తాము ఉక్రెయిన్‌కు చేయనున్న ఆయుధ సాయంలో మిలిటరీ హార్డ్‌వేర్, యాంటీ ట్యాంక్, ఇతర భారీ ఆయుధాలు కూడా ఉన్నాయని వివరించారు. అలాగే, రష్యాపై ఆర్థికపరమైన ఆంక్షలు రెట్టింపు చేయాలని ఆయన పాశ్చాత్య దేశాలకు పిలుపునిచ్చారు. ఉక్రెయిన్ కు మరింత సాయం చేయడానికి తమ భాగస్వామ్య పక్షాలతో కలిసి పనిచేస్తామని చెప్పారు. ఉక్రెయిన్ లోని నగరాలను రష్యా ధ్వంసం చేస్తోంటే తాము చూస్తూ ఉండలేమని తెలిపారు. ఇక ఇప్పటికే బ్రిటన్ ఉక్రెయిన్‌కు పెద్ద ఎత్తున ఆయుధ సాయం చేసింది. ఇప్పుడు చేస్తోన్న సాయం దానికి అదనం. రష్యా తీరుపై చర్చించడానికి నాటో, జీ 7 దేశాలు త్వరలో సమావేశం కానున్నాయి. ఈ సమయంలో బోరిస్ జాన్సన్ ఉక్రెయిన్‌కు మరింత సాయం ప్రకటించడం గమనార్హం.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/