సికింద్రాబాద్‌ అల్లర్ల కేసులో (ఏ-1)గా కామారెడ్డికి చెందిన వ్యక్తి

కేంద్రం తీసుకొచ్చిన అగ్ని పథ్ కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ లో శుక్రవారం ఆర్మీ విద్యార్థులు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. వీరిలో 46 మందిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. వీరి రిమాండ్ లో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. మొన్నటి వరకు ఈ అల్లర్ల వెనుక నరసారావు పేట సాయి ఢిపెన్స్‌ అకాడమీ డైరెక్టర్‌ ఆవుల సుబ్బారావు ప్రధాన కారణమని అంత భావించారు. కానీ ఇప్పుడు కామారెడ్డికి చెందిన మధుసూదన్‌ ను ప్రధాన సూత్రధారి (ఏ-1)గా పోలీసులు తేల్చారు. ఈ మేరకు వాట్సాప్‌ గ్రూపుల్లో విద్యార్థులను మధుసూదన్‌ రెచ్చగొట్టి విధ్వంసానికి కుట్ర పన్నినట్లు పోలీసులు నిర్దారించారు. అలాగే ఘటనలో ఇప్పటివరకు 56 మందిని రిమాండ్‌ రిపోర్టులో నిందితులుగా పేర్కొన్నారు.

మరోపక్క పల్నాడు జిల్లాలోని నరసరావుపేటలో సుబ్బారావు నిర్వహిస్తోన్న సాయి డిఫెన్స్‌ అకాడమీలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కేంద్ర ఇంటెలిజెన్స్, ఐటీ అధికారులు సంయుక్తంగా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. కార్యాలయంలోని దస్త్రాలు పరిశీలించిన అధికారులు.. సిబ్బంది నుంచి పలు వివరాలు సేకరించారు. నరసరావుపేటలో దాదాపు పదేళ్లుగా సుబ్బారావు సాయి డిఫెన్స్‌ అకాడమీని నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇన్నేళ్లుగా ఇక్కడి నుంచి ఎంత మంది ఆర్మీకి ఎంపికయ్యారు? అభ్యర్థుల నుంచి ఎంత ఫీజు వసూలు చేసేవారు? పన్నులు కడుతున్నారా? లేదా వంటి ఇతరత్రా లావాదేవీలు, శిక్షణకు సంబంధించిన వివరాలపై కూడా అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.