పార్టీ ఎంపీల నుంచి ఒత్తిడి..రాష్ట్రపతి ఎన్నికల్లో ముర్ముకే మద్దతు!

నిన్నటి భేటీలో మెజారిటీ ఎంపీల అభిప్రాయం ఇదే

uddhav thackeray
uddhav thackeray

ముంబయిః శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే.. ఇప్పుడు పార్టీ ఎంపీల నుంచి ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తోంది. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి అయిన ద్రౌపది ముర్ముకే ఓటు చేయాలంటూ వారు పట్టుబడుతున్నారు. ఈ ఒత్తిళ్లకు తలొగ్గి ముర్ముకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం మినహా ఉద్ధవ్ ముందు మరో మార్గం కనిపించడం లేదు. ఉద్ధవ్ థాకరేతో ఆయన నివాసం అయిన మాతోశ్రీలో సోమవారం శివసేన ఎంపీలు భేటీ అయ్యారు. ద్రౌపది ముర్ముకే మద్దుతు తెలపాలని ఎక్కువ మంది ఎంపీలు డిమాండ్ చేశారు. శివసేనకు మొత్తం 18 మంది ఎంపీలు ఉండగా, ఈ భేటీకి 13 మంది హాజరయ్యారు. ఇదే భేటీలో సేన రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ మాత్రం ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకే ఓటు వేయాలన్న అభిప్రాయం వినిపించారు.

ముఖ్యంగా శివసేన పార్టీలోని ఆదివాసీ వర్గానికి చెందిన వారు ముర్ముకే మద్దతు తెలపాలని డిమాండ్ చేస్తున్నారు. శివసేన ముర్ముకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే అది విపక్షాలకు గట్టి ఎదురుదెబ్బగానే చెప్పుకోవాలి. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాను తెర ముందుకు తెచ్చారు. ఆ తర్వాత మమతే వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీజేపీ ఆదివాసీ మహిళకు అవకాశం ఇచ్చి విపక్షాలకు గట్టి షాక్ ఇచ్చింది. దీంతో మమతా బెనర్జీ సైతం ముర్మును ఏకగ్రీవంగా ఎన్నుకోవడం సరైనదన్న అభిప్రాయాన్ని వినిపిస్తున్నారు. దీంతో రాష్ట్రపతి ఎన్నికకు ముందే బీజేపీ వ్యూహాత్మక విజయం సాధించిందని చెప్పుకోవాలి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/