200 మంది ఉద్యోగుల్ని తొలగించునున్న ఉబర్ సంస్థ

Uber layoff: Uber to sack 200 employees from its recruitment division

న్యూఢిల్లీః ప్రపంచ వ్యాప్తంగా కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, మెటా, ట్విట్టర్, గూగుల్, అమెజాన్ వంటి ప్రపంచ దిగ్గజ కంపెనీలు వేల సంఖ్యలో తమ ఉద్యోగుల్ని తీసేశాయి . ఆదాయం తగ్గడంతో ఖర్చు తగ్గింపులో భాగంగానే ఉద్యోగులను తొలగిస్తున్నట్లు చెబుతున్నాయి. మరికొన్ని కంపెనీలు కూడా అదేబాటలో పయనిస్తున్నాయి. విడతల వారీగా ఉద్యోగుల్ని ఇంటికి పంపించేస్తున్నాయి.

తాజాగా ప్రముఖ క్యాబ్‌ సేవల సంస్థ ఉబర్ కూడా లేఆఫ్స్ జాబితాలో చేరింది. సంస్థలో ఉద్యోగుల్ని తొలగించనున్నట్లు ప్రకటించింది. రిక్రూట్ మెంట్ విభాగంలో 200 మందిని తొలగిస్తున్నట్లు వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా 32,700 మంది ఉద్యోగుల్ని కలిగి ఉన్న ఉబర్ కంపెనీ ఈ ఏడాది ప్రారంభంలో రవాణా సేవల విభాగం నుంచి 150 మందిని తొలగించింది. ఇది తన గ్లోబర్ వర్క్ ఫోర్సులో 1 శాతంగా ఉంది. తాజాగా రిక్రూట్ మెంట్ విభాగంలో 35 శాతం కోత పెట్టింది. కాగా, 2020 మధ్యలో మహమ్మారి ప్రారంభంలో ఉబర్ తన సిబ్బంది సంఖ్యను 17 శాతం తగ్గించింది.