తిరుపతిలో ఫ్లైవోవర్ నిర్మాణం పనుల్లో ప్రమాదం..ఇద్దరు కూలీలు మృతి

తిరుపతిలో ఫ్లైవోవర్ పనుల్లో విషాదం చోటుచేసుకుంది. శ్రీనివాస సేతు వంతెన నిర్మాణ పనుల్లో క్రేన్లు వైర్లు తెగిపోవడం తో ఇద్దరు కూలీలు మృతి చెందారు. గత మూడేళ్లుగా శ్రీనివాస సేతు ఫ్లైవోవర్ నిర్మాణం పనులు అత్యంత చురుకుగా సాగుతున్నాయి. ఫస్ట్ పేస్, సెకండ్ పేస్ పూర్తి అయింది. ఇక థర్డ్ పేస్ చివరి దశలో ఉంది. మరో వారం రోజుల్లో మొత్తం పూర్తి అవుతుంది.

సిమెంట్ సెగ్మెంట్ అమర్చి కాంక్రీట్ వేస్తే ఫ్లైవోవర్ పూర్తి అయిపోయినట్లే. అలాంటి ఆఖరి సిమెంట్ సెగ్మెంట్ ను క్రేన్ తో పైకి లేపి అమర్చుతుండగా ఒక్కసారిగా క్రేన్ వైర్లు తెగిపోయాయి. దీంతో దానికి వేలాడుతున్న భారీ సిమెంట్ దిమ్మ దాదాపు ముప్పై అడుగుల ఎత్తు నుంచి కింద పడిపోయింది. అదే సమయంలో కిందనే ఉన్న ఇద్దరు కూలీలు ఘటనాస్థలంలోనే మరణించారు. పూర్తిగా సిమెంట్ దిమ్మ కింద ఇద్దరు నుజ్జునుజ్జు అయ్యారు. మరో క్రేన్ తో అత్యంత కష్టం మీద సిమెంట్ దిమ్మెను పక్కకు జరిపి మృతదేహాలను వెలికి తీశారు. అర్ధరాత్రి వేళ పనులు జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతి చెందిన కూలీలు పశ్చిమ బెంగాల్, బీహార్ వాసులుగా గుర్తించారు.