ఎమ్మెల్సీలుగా మహేశ్ గౌడ్, బల్మూరి వెంకట్ ఏకగ్రీవం

రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన రెండు స్థానాలకు ఎమ్మెల్సీలుగా ఎన్ఎస్‌యూఐ స్టేట్ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు దూరంగా ఉండటంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇద్దరు యూనానిమస్‌గా ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీ పదవులకు ఇతర పార్టీల నుండి ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికైన‌ట్లు అసెంబ్లీ సెక్రటరీ ఇవాళ ప్రకటించారు.

తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో రెండు ఎమ్మెల్సీల అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణకు జనవరి 22తో నామినేషన్ల గడవు ముగిసింది. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు రెండు నామినేషన్లు మాత్రమే వచ్చాయి. దీంతో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే కోటాలో ఎన్ఎస్ యూ స్టేట్ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల సంఘం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఆర్డర్ కాపీ తీసుకున్నారు మహేశ్ గౌడ్, బల్మూరి వెంకట్. అనంతరం మాట్లాడిన బల్మూరి వెంకట్.. అతి చిన్న వయసులో తనకు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్సీ మహేశ్ గౌడ్ మాట్లాడుతూ..విద్యార్థి,నిరుద్యోగులకు,ప్రభుత్వానికి మధ్య సంధాన కర్తగా ఉంటానన్నారు. తన సేవలు గుర్తించి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినందుకు పార్టీకి ధన్యవాదాలు తెలిపారు.