పాక్​లో​ ఇద్దరు సిక్కు వ్యాపారుల హత్య..

పాకిస్థాన్‌లోని ఖైబర్ ఫఖ్తుంఖ్వా లో దారుణంగా జరిగింది. ఇద్దరు సిక్కు వ్యాపారులను అతి దారుణంగా హత్య చేసారు. సర్బాంద్‌ పట్టణంలోని బాబా తాల్ బజార్‌లో వ్యాపారం చేస్తున్న సల్జీత్‌ సింగ్‌(42), రంజీత్‌ సింగ్‌ (38) లపై దుండగులు కాల్పులు జరపడం వల్ల వారు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనంతరం దుండగులు బైకుపై పారిపోయారు. అయితే, ఈ దాడులకు పాల్పడింది ఎవరనే విషయం తెలియనప్పటికీ ఉగ్రచర్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక పోలీస్‌ సూపరింటెండెంట్‌ అకిక్‌ హుస్సేన్‌ మీడియాకు వెల్లడించారు.

సిక్కు వ్యాపారుల హత్యను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మహమూద్ ఖాన్ ఖండించారు. నిందితులను పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. రాష్ట్రంలో మత సామరస్యాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రగా దీనిని అభివర్ణించారు. ఖైబర్ ఫఖ్తుంఖ్వా రాజధాని అయిన పెషావర్‌లో దాదాపు 15 వేల మంది వరకు సిక్కులు నివసిస్తున్నారు. వారిలో అత్యధికులు వ్యాపారులే. వీరిపై దాడులు సర్వసాధారణంగా మారాయి. గతేడాది సెప్టెంబరులో యునానీ వైద్యుడు హకీం, అంతకుముందు ఏడాది ఓ టీవీ చానల్‌లో యాంకర్‌గా పనిచేస్తున్న రవీందర్ సింగ్, 2018లో ప్రముఖ సిక్కు నేత చరణ్‌జీత్ సింగ్, 2016లో జాతీయ అసెంబ్లీ సభ్యుడు సోరెన్ సింగ్‌ను దుండగులు కాల్చి చంపారు.