అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ వేళ.. 11 రోజుల ఆచార కార్యక్రమాలను ప్రారంభించిన మోడీ

ఎన్నో తరాలు కలలుగన్న సమయం ఆసన్నమయిందన్న ప్రధాని..ఆడియో మెసేజ్ ను పోస్ట్

PM Modi message on Pran-Pratishtha of Shri Ram in Ayodhya

న్యూఢిల్లీః అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి ముందు జరిగే కార్యక్రమాలను ప్రధాని మోడీ ప్రారంభించారు. నేటి నుంచి 11 రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ఆయన ఆడియో మెసేజ్ ను పోస్ట్ చేశారు. తన జీవితంలో తొలిసారి ఎంతో భావోద్వేగానికి గురవుతున్నానని ప్రధాని చెప్పారు. తొలిసారి ఒక ప్రత్యేకమైన అనుభూతిని పొందుతున్నానని తెలిపారు. శ్రీరాముడి విగ్రహం ప్రాణప్రతిష్టను వీక్షించడం ఒక గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.

‘మన గ్రంథాలు చెపుతున్నట్టు భగవంతుడి యజ్ఞం కోసం, ఆరాధన కోసం మనలో ఉన్న దివ్య చైతన్యాన్ని మేల్కొల్పాలి. దీని కోసం మనం పాటించాల్సిన కఠినమైన నియమాలను మన గ్రంథాలు తెలియజేస్తున్నాయి. నాకు సాధువులు సూచించిన ప్రవర్తనా సూత్రాల ప్రకారం ఈరోజు నుంచి 11 రోజుల పాటు ప్రత్యేక ఆచారాన్ని ప్రారంభిస్తున్నాను’ అని మోడీ చెప్పారు.

ఎన్నో తరాలు కలలుగన్న సమయం ఆసన్నమయిందని మోడీ అన్నారు. ఆ భగవంతుడే తనను భారతీయుల ప్రతినిధిగా చేశాడని చెప్పారు. తాను ఒక సాధనం మాత్రమేనని, ఇది ఒక పెద్ద బాధ్యత అని అన్నారు. ప్రజలందరి ఆశీస్సులు తనకు కావాలని చెప్పారు.

YouTube video