మ‌రో రెండు డ్రోన్లు..హైఅల‌ర్ట్ ప్ర‌క‌టించిన అధికారులు

రాత్నుచక్‌-కాలుచక్ మిలిట‌రీ ఏరియా వ‌ద్ద ఘ‌ట‌న‌

జ‌మ్ము: జమ్ము విమానాశ్రయంలోని వాయుసేన వైమానిక స్థావరంపై నిన్న తెల్ల‌వారు జామున‌ రెండు డ్రోన్లు పేలుడు పదార్థాల(ఐఈడీ)ను జారవిడవ‌డం క‌ల‌కలం రేపిన విష‌యం తెలిసిందే. ఈ దాడిని మ‌ర‌వ‌క‌ముందే జ‌మ్ములోని రాత్నుచక్‌-కాలుచక్ మిలిట‌రీ ఏరియా వ‌ద్ద ఈ రోజు తెల్ల‌వారు జామున రెండు డ్రోన్లు క‌ల‌క‌లం రేపాయి. నిన్న జ‌రిగిన దాడిని దృష్టిలో పెట్టుకుని భార‌త‌ సైన్యం వెంట‌నే అప్ర‌మ‌త్త‌మై ఆ డ్రోన్లను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జ‌రిపిన‌ప్ప‌టికీ వాటిని కూల్చలేక‌పోయింది. ఆర్మీ జ‌వాన్లు 20-25 రౌండ్ల కాల్పులు జ‌రిపారు. అయితే చీక‌ట్లో ఆ రెండు డ్రోన్లు త‌ప్పించుకుని వెళ్లిపోయాయి. వాటిని క‌నిపెట్ట‌డానికి పెద్ద ఎత్తున సెర్చ్ ఆప‌రేష‌న్ నిర్వ‌హిస్తున్నారు. ఆ డ్రోను తిరిగిన‌ ప్రాంతంలో ఏవైనా పేలుడు ప‌దార్థాలను జార విడిచిందా? అన్న విష‌యాన్ని తేల్చేందుకు సైన్యం సెర్చ్‌ ఆప‌రేష‌న్ చేప‌ట్టింది.

ఇంతవరకు ఎటువంటి ఆధారాలు దొర‌క‌లేద‌ని అధికారులు చెప్పారు. జ‌మ్ము ప్రాంతంలో ముఖ్యంగా ఆర్మీ స్టేష‌న్ల‌లో హై అలెర్ట్ ప్ర‌క‌టించారు.  పాక్ డ్రోన్ల సాయంతో ఇటువంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతుండ‌డం ప‌ట్ల భార‌త‌ సైన్యం అప్ర‌మ‌త్తమైంది. 2019 నుంచి పాక్ డ్రోన్ల ద్వారా జ‌మ్ములోని ఉగ్ర‌వాదుల‌కు ఆయుధాలు, డ్ర‌గ్స్ వంటివి స‌ర‌ఫ‌రా చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు జ‌రుపుతోంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/