ఢిల్లీ ఛలోకు తాత్కాలికంగా రెండు రోజలు విరామం

Two days temporary break for Delhi Chalo

న్యూఢిల్లీః పంటలకు కనీస మద్దతు ధర, రైతు రుణమాఫీ సహా పలు డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వంతో నాలుగో విడత చర్చలు విఫలమైన వేళ, రైతులు పిలుపునిచ్చిన ఢిల్లీ ఛలోకు తాత్కాలికంగా రెండు రోజలు విరామం ప్రకటించారు. అంతకుముందు హరియాణాలో జరిగిన ఉద్రిక్త పరిస్థితుల్లో భద్రతా దళాల చేతిలో శుభకరణ్ అనే రైతు మరణించినట్లు రైతు సంఘాల నేతలు తెలిపారు. ఖనౌరీ ప్రాంతంలో భద్రతా సిబ్బందికి నిరసన తెలుపుతున్న రైతులకు మధ్య జరిగిన ఘర్షణలో 21 ఏళ్ల రైతు మరణించగా మరికొంత మంది గాయపడినట్లు కర్షక సంఘ నేతలు తెలిపారు. ఫిబ్రవరి 13న దిల్లీ చలో మార్చ్‌ ప్రారంభమైనప్పటి నుంచి జరిగిన ఘర్షణల్లో ఇదే తొలి మరణమని వెల్లడించారు. మరణించిన రైతును పంజాబ్‌లోని భటిండా జిల్లాలోని బలోకే గ్రామానికి చెందిన సుభకరన్ సింగ్‌గా గుర్తించినట్లు రైతు నాయకుడు బల్దేవ్ సింగ్ సిర్సా తెలిపారు. ఘర్షణలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారని అందులో ఒకరు మరణించారని పాటియాలా హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ తెలిపారు.

‘రైతు మరణానికి కారణమైన పోలీసుపై చర్యలు తీసుకుంటాము. తాము పండించిన వ్యవసాయ ఉత్పత్తులపై తగిన ధర కోసం ఆయన ఇక్కడకు వచ్చారు. పంజాబ్ ప్రభుత్వం రైతుల తరుపునే ఉంటుంది. రాష్ట్రపతి పాలన విధిస్తామని వారు మమ్మల్ని బయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. నేను ఇటువంటి వాటికి బయపడటం లేదు. రాష్ట్రంలో శుభకరణ్​లా ఎవరూ మరణించకుండా చూస్తాను. కేంద్ర ప్రభుత్వం రైతుల డిమాండ్లపై దృష్టి సారించాలని మరో సారి విజ్ఞప్తి చేస్తున్నాను’ అని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తెలిపారు.