ఉత్తరాఖండ్లో ఏ క్షణమైనా భూకంపం రావొచ్చు..నిపుణుల హెచ్చరిక

Turkiye-magnitude earthquake could hit Uttarakhand: Expert

లక్నోః టర్కీ, సిరియాల్లో భూకంపం బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ భూకంపం ధాటికి ఆయా దేశాల్లో కలిపి 47వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయాలు. లక్షలాది మంది క్షతగాత్రులయ్యారు. ఈ నేపథ్యంలో టర్కీలో సంభవించిన భూకంపం ..ఉత్తరాఖండ్లోనూ వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉత్తరాఖండ్లో ఎప్పుడైనా శక్తివంతమైన భూ కంపం రావచ్చని చెబుతున్నారు. ఉత్తరాఖండ్లోని భూమి ఉపరితలం కింద తీవ్ర ఒత్తిడి ఏర్పడుతోందని..దీని కారణంగా భారీ భూకంపం వచ్చే ప్రమాదం ఉందని హైదరాబాద్లోని జాతీయ జియోఫిజికల్ రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్ శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ పూర్ణచందర్ రావు తెలిపారు. అయితే భూకంపం ఎప్పుడు వస్తుందో ప్రత్యేకంగా చెప్పలేమన్నారు. ఇలాంటి విధ్వంసాలు..ఓ భౌగోళిక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారే అనేక కారకాలపై ఆధారపడి ఉంటాయని పేర్కొన్నారు.

ఇప్పటికే ఉత్తరాఖండ్‌పై దృష్టి సారించి హిమాలయ ప్రాంతంలో దాదాపు 80 భూకంప కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎన్ పూర్ణచందర్ రావు తెలిపారు. పరిస్థితిని సరైన సమయంలో పర్యవేక్షిస్తున్నామని….ఒత్తిడి భారీ స్థాయిలో పేరుకుపోతున్నట్లు డేటాలో కనిపిస్తోందన్నారు. ఉత్తరాఖండ్ ప్రాంతంలో GPS నెట్‌వర్క్‌లు ఉన్నాయని…వాటి పాయింట్లు క్షణ క్షణానికి కదులుతున్నాయన్నారు. ఇది ఉపరితలం కింద జరుగుతున్న మార్పులను సూచిస్తుందని చెప్పారు. భూమిలోపల ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వేరియోమెట్రిక్ జీపీఎస్ డేటా ప్రాసెసింగ్ నమ్మదగిన పద్ధతుల్లో ఒకటి అని వివరించారు. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ లో ఏ క్షణమైనా భారీ భూకంపం రావచ్చని..సరైన సమయం, తేదీని మాత్రం అంచనా వేయలేమన్నారు.

రిక్టర్ స్కేల్‌పై 8 తీవ్రతతో భూకంపం సంభవిస్తే దాన్ని శక్తివంతమైన భూకంపంగా పిలుస్తామని పూర్ణచందర్ రావు తెలిపారు. టర్కీలో 7.8 తీవ్రతతో భూకంపం సంభవించింద్నారు. అయితే సాంకేతికంగా దీనిని భారీ భూకంపంగా పిలవరు కానీ..అక్కడ నాణ్యతలేని నిర్మాణాల వల్ల భారీ నష్టం జరిగిందన్నారు. ఈ తరుణంలో జమ్మూ కశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకూ వ్యాపించి ఉన్న హిమాలయ ప్రాంతంలో 8 కంటే ఎక్కువ తీవ్రతతో భూకంపం సంభవించే ముప్పు ఉందని హెచ్చరించారు.