శ్రీవారి భక్తులకు బంగారు మంగళసూత్రాలు, లక్ష్మీకాసుల విక్రయంః టీటీడీ ప్రకటన
తిరుమలః తిరుమలలో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. శ్రీవారి భక్తులకు బంగారు మంగళసూత్రాలు, లక్ష్మీకాసులను విక్రయించాలని నిర్ణయించినట్టు టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి తెలిపారు. ధర్మప్రచారంలో భాగంగా బంగారు మంగళసూత్రాలను తయారు చేసి శ్రీవారిపాదాల వద్ద ఉంచి భక్తులకు విక్రయించనున్నట్టు చెప్పారు. గతంలో 32 వేల మందికి సామూహిక వివాహాలు జరిపి మంగళసూత్రాలు అందించగా వారిలో ఏ ఒక్కరూ మతం మారలేదని, మత మార్పిళ్లకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. 5, 10 గ్రాముల బరువుతో నాలుగైదు డిజైన్లలో బంగారు మంగళసూత్రాల విక్రయాలు జరుగుతాయని, లాభాపేక్ష లేకుండా భక్తులకు అమ్ముతామని కరుణాకర్ రెడ్డి వెల్లడించారు.
ధర్మకర్తల మండలి సమావేశంలో రూ.5,141.74 కోట్ల అంచనాతో వార్షిక బడ్జెట్‌కు టీటీడీ ఆమోదం తెలిపింది. సమావేశం అనంతరం చైర్మన్ కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి, ఇతర సభ్యులు మీడియాతో మాట్లాడారు. తిరుపతిలోని శ్రీపద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి శ్రీపద్మావతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్‌గా పేరు మార్పునకు ఆమోదం తెలిపినట్టు వివరించారు. ఆకాశగంగ నుంచి ఔటర్ రింగ్‌రోడ్డు వరకు ఉన్న రెండు వరుసల రహదారిని నాలుగు వరుసల రహదారిగా మార్చేందుకు నిర్ణయించామని, ఇందుకోసం రూ.30.71 కోట్లతో టెండరుకు ఆమోదం తెలిపారని చెప్పారు. ఇక టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న 26 స్థానిక ఆలయాలు, విలీనం చేసుకున్న 34 ఆలయాల్లో నూతన పోస్టుల కోసం ప్రభుత్వ ఆమోదానికి ప్రతిపాదన పంపేందుకు నిర్ణయించామని చెప్పారు.