నవీ ముంబాయిలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి టీటీడీ భూమిపూజ

TTD perform bhoomi pooja for replica of Tirupati Balaji temple in Navi Mumbai

ముంబయిః ఈరోజు టీటీడీ ఆధ్వర్యంలో నవీ ముంబాయి లో నిర్మిస్తున్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి బుధవారం భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేందర్‌ పడ్నవిస్‌, టీటీడీ చైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి సమక్షంలో వేద మంత్రోచ్ఛరణల మధ్య పూజ కార్యక్రమాలను నిర్వహించారు. మహా ప్రభుత్వం కేటాయించిన సుమారు 10 ఎకరాల్లో నిర్మిస్తున్న ఆలయానికి రేమాండ్‌ గ్రూప్‌ సీఎండీ గౌతం హరి సింఘానియా 60 నుంచి 75 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు.

ఈ సందర్భంగా సీఎం ఏక్‌నాథ్‌ షిండే మాట్లాడుతూ.. ముంబాయి వాసుల సుదీర్ఘ కాల నెరవేరనుందని పేర్కొన్నారు. తిరుపతికి వెళ్లి స్వామివారిని దర్శించుకునేందుకు వెళ్లలేని భక్తులకు నవీ ముంబాయిలో నిర్మిస్తున్న శ్రీవారి ఆలయం ఎంతగానో ఉపయోగ పడుతుందని వెల్లడించారు. ఆలయం నిర్మాణంలో తమ వంతు పూర్తి సహకారం అందజేస్తామని ఆయన తెలిపారు.

టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. తిరుమలలో ఉన్నమాదిరిగా నవీ ముంబాయిలో ఆలయాన్ని నిర్మిస్తామని తెలిపారు. పుష్కరిణీ, అలంకార మండపం, రథ మండపం, వాహన మండపం, మాఢ వీధులను నిర్మించి రెండు సంవత్సరాల్లో ఆలయాన్ని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి, టీటీడీ బోర్డు సభ్యులు మిలింద్‌ నర్వేకర్‌, అమోల్‌ కాలే, రాజేశ్‌ శర్మ, సౌరభ్‌ బోరా తదితరులు పాల్గొన్నారు.