ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు.. మరికాసేపట్లో రాజ్‌భవన్‌ ముట్టడి

ఆర్టీసీ విలీనం బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపాలంటూ డిమాండ్

tsrtc-employees- strike

హైదరాబాద్‌: టీఎస్ఆర్టీసీ కార్మికులు, సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేందుకు ఉద్దేశించిన బిల్లుకు గవర్నర్ ఆమోదం కోరుతూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన నిరసన కార్యక్రమం ముగిసింది. శనివారం ఉదయం 2 గంటలపాటు రాష్ట్ర వ్యాప్తంగా డిపోల ముందు ధర్నాలు చేసిన కార్మికులు.. మరికాసేపట్లో రాజ్‌భవన్‌ ముట్టడికి బయల్దేరనున్నారు. ఇందులో భాగంగా నెక్లెస్‌రోడ్డులోని అంబేద్కర్‌ విగ్రహం వద్దకు ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు భారీగా చేరుకుంటున్నారు. హైదరాబాద్‌తోపాటు జిల్లాల నుంచి ఆర్టీసీ బస్సుల్లో నెక్లెస్‌రోడ్డుకు పెద్దఎత్తున తరలివస్తున్నారు. 11 గంటలకు నెక్లెస్‌ రోడ్డు నుంచి రాజ్‌భవన్‌కు ర్యాలీగా వెళ్లనున్నారు. ఆర్టీసీ బిల్లును వెంటనే ఆమోదించాలని కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ప్రభుత్వం బిల్లును రూపొందించింది. బిల్లును ఆమోదం కోసం గవర్నర్‌ తమిళసైకి పంపించింది. అయితే వివిధ కారణాలతో గవర్నర్‌ తమిళిసై బిల్లును తొక్కిపెట్టారు. దీంతో ఆర్టీసీ కార్మికులు జంగ్‌ సైరన్‌ మోగించారు. గవర్నర్‌ వైఖరికి నిరసనగా ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు బస్సులను నిలిపివేశారు. డిపోల ముందు ధర్నాలు నిర్వహించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రెండు గంటలపాటు బస్సు సర్వీసులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.