నటుడు మనోజ్ బాజ్‌పాయ్ ఇంట్లో విషాదం

బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి ఆర్‌కే బాజ్‌పాయ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. అయితే ప్రస్తుతం కేరళలో షూటింగ్‌లో ఉన్న మనోజ్.. తన తండ్రి మరణ వార్త వినగానే షూటింగ్‌ని మధ్యలోనే వాయిదా వేసుకొని ఢిల్లీకి వెళ్లారు. కొద్దిరోజుల క్రితమే తన తండ్రికి తనకు ఉన్న అనుబంధాన్ని మనోజ్ మీడియాతో పంచుకున్నారు.

తాను ఎంతో ఉన్నత చదువులు చదువుకోవాలని తన తండ్రి ఆకాంక్షించేవారు ఆని ఆయన పేర్కొన్నారు. బీహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో బెల్వా అనే చిన్న గ్రామంలో జన్మించిన మనోజ్‌ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో చేరడానికి ఢిల్లీకి మకాం మార్చాడు. తర్వాత అవకాశాల కోసం ముంబైకి చేరాడు. ఈ 52 ఏళ్ల నటుడు ప్రస్తుతం ఓటీటీల్లో విజయాలతో కెరీర్‌ పరంగా దూసుకుపోతున్నాడు. ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ తో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. మనోజ్‌ కుమార్ తండ్రి మృతిపై పలువురు బాలీవుడ్ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్లు ప్రార్థన చేస్తున్నట్లు కామెంట్ చేస్తున్నారు.