‘TG’పై ఈరోజో, రేపో నోటిఫికేషన్..!

తెలంగాణ ప్రభుత్వం TS పేరును TGగా మార్చాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా జరిగిన కేబినెట్ భేటీలో తెలంగాణ స్టేట్ (TS) బదులుగా తెలంగాణ గవర్నమెంట్ (TG) అని మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఈ నెల 5న లేఖ రాసింది. రవాణాశాఖ సంయుక్త కమిషనర్ పాండురంగనాయక్ ఢిల్లీ వెళ్లి ఉన్నతాధికారులను కూడా కలిశారు. అయితే, ఒకటి రెండు రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేసేందుకు కేంద్రం నిర్ణయించినట్టు తెలుస్తోంది. కేంద్ర ఉత్తర్వులు వచ్చిన వెంటనే రాష్ట్ర రవాణాశాఖ కూడా ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఆపై రాష్ట్ర వ్యాప్తంగా కొత్త కోడ్‌తో రిజిస్ట్రేషన్లు మొదలవుతాయి. అయితే, ఈ మార్పును ప్రభుత్వం కొత్త వాహనాలకే పరిమితం చేసింది. పాత వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్‌ను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది.

అసలు TS ను TG గా మార్చడం ఫై సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ తల్లి విగ్రహం రూపం, రాష్ట్ర చిహ్నంలో మార్పులు, వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్ TS నుంచి TGగా మార్చడంపై సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ (X) వేదికగా స్పందించారు. ఈ నిర్ణయాల వెనుక 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఉందని అన్నారు. ‘ఒక జాతి అస్థిత్వానికి చిరునామా ఆ జాతి భాష, సాంస్కృతిక వారసత్వమే. ఆ వారసత్వాన్ని సమున్నతంగా నిలబెట్టాలన్న సదుద్దేశంతోనే ‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని రాష్ట్ర అధికారిక గీతంగా.. సగటు తెలంగాణ ఆడబిడ్డ రూపురేఖలే తెలంగాణ తల్లి విగ్రహానికి ప్రతిరూపంగా… రాచరిక పోకడలు లేని చిహ్నమే రాష్ట్ర అధికారిక చిహ్నంగా… వాహన రిజిస్ట్రేషన్లలో TS బదులు ఉద్యమ నినాదం TG అక్షరాలు ఉండాలన్నది 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష. ఆ ఆకాంక్షలను నెరవేరుస్తూ రాష్ట్ర కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నాం.’ అని రేవంత్ రెడ్డి తెలిపారు.