వాళ్లు ఛాలెంజ్ చేస్తే నేను కచ్చితంగా స్పందిస్తా

మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో కెటిఆర్‌ వ్యాఖ్యలు

minister ktr

హైదరాబాద్‌: మంత్రి కెటిఆర్‌ జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఈరోజు మీట్ ది ప్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా ఓ విలేకరి అడిగిన ప్రశ్నలకు కెటిఆర్‌ ఆసక్తికర సమాధానాలను ఇచ్చారు. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓడిపోతే రాజీనామా చేస్తామని చెప్పారని, ఈసారి కూడా అదే ఛాలెంజ్ మళ్లీ చేస్తారా? అనే ప్రశ్నకు బదులుగా… ‘ప్రతిసారి నేనే ఛాలెంజ్ చేయాలా? ఈసారి వాళ్లను చేయమనండి. వాళ్లు ఛాలెంజ్ చేస్తే నేను కచ్చితంగా స్పందిస్తా’ అని చెప్పారు.

గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగురవేస్తామని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ… తామైతే బల్దియాపై గులాబీ జెండా ఎగురవేస్తామని కెటిఆర్ అన్నారు. గోల్కొండపై కషాయాలు, కాషాయాలు ఉండవని చెప్పారు. గోల్కొండపై కెసిఆర్‌ జాతీయ జెండాను ఎప్పుడో ఎగరేశారని… ఆ విషయం బండి సంజయ్ కు తెలియనట్టుందని ఎద్దేవా చేశారు. ఇప్పుడు గోల్కొండపై కొత్తగా బండి సంజయ్ ఎగరేసేదేమీ లేదని అన్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/