వడగండ్ల వానతో నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దుః మంత్రి హరీశ్‌ రావు

ts-minister-harish-rao-says-government-will-support-farmers

సిద్దిపేటః గత రాత్రి కురిసిన అకాల వర్షాలకు సిద్దిపేట జిల్లాలో పంటలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో సిద్దిపేట అర్బన్‌ మండలం నాంచారుపల్లి, బక్రిచెప్యాల గ్రామాల్లో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి మంత్రి హరీశ్‌ రావు పర్యటించారు. వడగండ్ల వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. పంటనష్టం వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని, సిఎం కెసిఆర్‌ దృష్టికి తీసుకెళ్లి నష్టపరిహారం అందిస్తామని ధైర్యం చెప్పారు. ప్రభుత్వం రైతులను ఆదుకుంటుందన్నారు. యుద్ధప్రాతిపదికన నష్టపోయిన ధాన్యం పంటల వివరాలు సేకరించాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని మంత్రి ఆదేశించారు. వడగండ్ల వానతో నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దని, ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి హరీశ్‌ రావు రైతులకు భరోసానిచ్చారు.

వడగండ్ల వానతో రైతులకు తీవ్ర నష్టం జరిగిందని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. పంటనష్టం అంచనాలు వేయాలని అధికారులకు చెప్పామని తెలిపారు. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ రైతులను ఆదుకుంటామని చెప్పారు. సిద్దిపేట జిల్లాలో దాదాపు 40 వేల ఎకరాల్లో పంటనష్టం జరిగిందని వెల్లడించారు. తినేముద్ద జారిపడినట్లుగా రైతుల పరిస్థితి తయారైందన్నారు. కౌలు రైతుల పరిస్థితి మరీ దీనంగా ఉందని పేర్కొన్నారు. రైతులు మనోధైర్యంతో ఉండాలని, ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు.