ఈ నెల 18 న హైదరాబాద్ లో మహా ధర్నా కు పిలుపునిచ్చిన కేసీఆర్

ధాన్యం కొనుగోలు విషయంలో గత కొద్దీ రోజులుగా తెరాస VS బిజెపి వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. మీరు కొనుగోలు చేయాలంటే మీరు కొనుగోలు చేయాలంటూ ఒకరి ఫై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ తరుణంలో తెరాస అధినేత , ముఖ్యమంత్రి కేసీఆర్ మహాధర్నా కు పిలుపునిచ్చారు. నవంబర్ 18 న హైదరాబాద్‌ లోని ఇందిరా పార్క్‌ వద్ద మహా ధర్నా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ధాన్యం కొనుగోలు విషయం లో కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసన గా టీఆర్‌ఎస్‌ పార్టీ నిరసన చేయాలని ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ మహా ధర్నా కు టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అలాగే మంత్రులు పాల్గొననున్నారు.

మంగళవారం తెలంగాణ భ‌వ‌న్‌లో టీఆర్ఎస్ ఎల్పీ స‌మావేశం ముగిసిన అనంత‌రం కేసీఆర్ మాట్లాడుతూ.. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసే బాధ్య‌త దేశ ఆహార అవ‌స‌రాల నిమిత్తం బ‌ప‌ర్ స్టాక్స్ మెయింటెన్ చేయాల‌న్సిన బాధ్య‌త కేంద్రానిది. వడ్లు కొంటే ప్రాసెసింగ్‌లో భాగంగా బియ్యం చేయ‌డం కూడా కేంద్రం ఆధీనంలో ఉన్న‌ది. ఎఫ్‌సీఐ గోడౌన్లు ధాన్యాన్ని నిల్వ చేయాలి. ఇది కేంద్ర ప్ర‌భుత్వం బాధ్య‌త‌. ఇవాళ రాష్ట్రానికో నీతి, ప్రాంతానికో నీతి అనే ప‌ద్ధ‌తిలో వ్య‌వ‌హ‌రిస్తోంది. పంజాబ్‌లో మొత్తం వ‌రి ధాన్యాన్ని కొంటున్నారు. మ‌న వ‌ద్ద నిరాక‌రిస్తున్నారు.

యాసంగిలో కొంటామ‌ని గ‌తంలో ఎఫ్‌సీఐ చెప్పి కేంద్రం నిరాక‌రించింది. అప్పుడు కేంద్రాన్ని నిల‌దీశాం. కేంద్రం ఆల‌స్యం చేస్తోంది. రైతు వ్య‌తిరేకంగా కేంద్రం ఉంది. దీంతో మేం అప్ర‌మ‌త్త‌మ‌య్యాం. మీరు ధాన్యం పండించకండి. పంట మార్పిడి చేయండి అని వ్య‌వ‌సాయ శాఖ మంత్రి మ‌న రైతుల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. వ‌రి ధాన్యం కొన్నాక బియ్యం చేసి నిల్వ చేయాలి. కానీ ఆ ప‌రిస్థితి లేదు. బియ్యం నిల్వ చేసే ప‌రిస్థితి ఇండియాలో ఏ రాష్ట్రంలో లేదు. బియ్యం నిల్వ చేసేందుకు గోడౌన్లు కూడా లేవు. తెలంగాణ‌లో వ‌చ్చిన ధాన్యాన్ని గ‌త యాసంగిలో జూనియ‌ర్ కాలేజీ, రైతువేదిక‌, ఫంక్ష‌న్ హాఅల్స్‌లో స్టాక్ చేశాం. ఆ ధాన్యం నిల్వ చేయ‌డానికి కార‌ణం కేంద్రం క‌న్ఫ్యూజ‌న్ వ‌ల్లే. ఆ ధాన్యం ఇప్ప‌టికీ కూడా గోదాముల్లోనే ఉంది. గ‌త యాసంగిలో 5 ల‌క్ష‌ల ధాన్యాన్ని కొంటామ‌ని చెప్పిన‌ కేంద్రం నుంచి ఉలుకుప‌లుకు లేదు. ఇప్పుడేమో అస‌లు మాట్లాడుత‌లేరు. కానీ ఈ రోజు వ‌ర‌కు కేంద్రం ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు అని సీఎం కేసీఆర్ తెలిపారు.