వ్యాక్సిన్స్ ముందుగా మాకే..ట్రంప్
కార్యనిర్వాహక ఉత్తర్వులపై అధ్యక్షుడి సంతకం

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కరోనా వ్యాక్సిన్స్ అందజేత విషయంలో తొలుత అమెరికన్లను ప్రాధ్యానం ఇస్తూ రూపొందించిన కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. అయితే ఇప్పటికే అమెరికాకు చెందిన వ్యాక్సిన్ తయారీ సంస్థలు పలు దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకున్న నేపథ్యంలో ట్రంప్ ఆదేశాలు న్యాయ సమీక్షకు నిలబడతాయా లేదా అన్నది సందేహంగా మారింది. మరోవైపు అసలు అమెరికా ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా వ్యాక్సిన్ డోసులు లభ్యమవుతాయా అన్నది కూడా అనుమానంగానే ఉంది. ఫిబ్రవరిలోగా 10 కోట్ల మందికి, జూన్‌లోగా మొత్తం అమెరికన్లకు వ్యాక్సిన్ ఇవ్వాలని అక్కడి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
అయితే ఆ దిశగా ప్రయత్నాలు మాత్రం జరగడం లేదని అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ ఆరోపిస్తున్నారు. ట్రంప్ వ్యాక్సిన్ పంపిణీ విధానాల గురించి చెబుతున్న సమయంలోనే బైడెన్ కూడా దీనిపై స్పందించారు. కాంగ్రెస్ అత్యవసరంగా వ్యాక్సిన్ తయారీ కోసం ఫండ్స్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఉన్నదని బైడెన్ స్పష్టం చేశారు. లేదంటే అమెరికన్లు వ్యాక్సిన్ కోసం నెలల తరబడి వేచి చూసే ప్రమాదం ఉన్నదని ఆయన హెచ్చరించారు. తాను అధికారం చేపట్టిన తర్వాత తొలి వంద రోజుల్లోనే 10 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తామని బైడెన్ తెలిపారు. జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.
తాజా వీడియోస్ కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/videos/