బైడెన్ తో డిబేట్ లో పాల్గొనేందుకు సిద్ధం

నేను చేసినట్టుగా ఎవరూ చేయలేరన్న ట్రంప్

trump

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ ఇంకా వైట్‌ హౌజ్‌లో కరోనాకు చికిత్స అందుకుంటున్న విషయం తెలిసిందే. అయితే కరోనా పూర్తిగా తగ్గకపోయినా, మాస్క్ తీసేసి తిరుగుతూ, వైట్ హౌస్ సిబ్బందిని భయాందోళనలకు గురి చేస్తున్న ట్రంప్, తాను ఫిట్ గా ఉన్నానని చెప్పడానికి చాలా కష్టపడుతున్నారు. ఆయన గొంతులో మునుపటి ఉత్సాహం కనిపించడం లేదని, అధికంగా ఊపిరి తీసుకుంటున్నారని పరిశీలకులు అంటున్నారు. రెండు లక్షల మందికి పైగా చనిపోయినా భయపడాల్సిన అవసరం లేదని తన ట్విట్టర్ ఖాతాలో ట్రంప్ వ్యాఖ్యానించారు.

‘రిస్క్ ఉందని నాకు తెలుసు. ఇప్పుడు మరింత మెరుగ్గా ఉన్నాను. నా శరీరంలో వ్యాధి నిరోధకత ఉండి ఉండవచ్చు. నేను చేసినట్టుగా ఏ నాయకుడూ చేయలేడు. నేను వెనక్కు తగ్గబోను. నా ప్రత్యర్థి బైడెన్ తో 15న జరుగనున్న మియామీ డిబేట్ లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నాను. నేనే ముందుంటాను. నేనే నాయకత్వం వహిస్తాను’ అని వ్యాఖ్యానించారు.

ఇదిలావుండగా, ట్రంప్ ఇంకా పూర్తిగా కోలుకోలేదని, ఆయన కోలుకునేందుకు మరో వారం రోజుల సమయమన్నా పడుతుందని ట్రంప్ ప్రత్యేక వైద్యుడు డాక్టర్ సీన్ కాన్లే వ్యాఖ్యానించారు. ట్రంప్ కు ఇప్పటివరకూ నాలుగు డోస్ ల రెమిడెసివిర్ ను వైద్యులు ఇచ్చారని అన్నారు. ఇతరులకు వ్యాధి వ్యాపించకుండా ఉండాలంటే, కరోనా బారిన పడిన వారు కనీసం 10 రోజులు ఐసోలేషన్ లో ఉండాలని నిపుణులు చెబుతున్నా, వాటిని ఖాతరు చేయని ట్రంప్ యథేచ్ఛగా వైట్ హౌస్ లో తిరుగుతుంటే, ఉద్యోగులంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/