టీఆర్ఎస్‌లో నాగార్జున ‘సాగర్’ మథనం?

నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఇటీవల మృతి చెందడంతో ఇప్పుడు మరోసారి తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇటీవల దుబ్బాకలో జరిగిన ఉపఎన్నికలు టీఆర్ఎస్ పార్టీకి ఊహించని ఫలితాలనివ్వడంతో ఇప్పుడు మరోసారి తెరాస అధిష్టానం తీవ్ర ఆందోళనకు గురవుతోందట. దుబ్బాకలో తెరాస అభ్యర్థి బలహీనంగా ఉండటమే తమ ఓటమికి కారణమని తెరాస వర్గాలు అంటున్నాయి. అయితే ఇప్పుడు ఇదే పరిస్థితి నాగార్జున సాగర్‌లో కూడా రిపీట్ కానుందా అనే ప్రశ్నకు అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది.

నోముల నర్సింహయ్య మృతితో అక్కడ ఉపఎన్నికలకు రంగం సిద్ధమైంది. అయితే నాగార్జున సాగర్ నుండి పోటీ చేసి గెలిచే తెరాస అభ్యర్థి ఎవరనే విషయం మాత్రం మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. నోముల కుటుంబానికి చెందిన వ్యక్తికి సీట్ ఇస్తే వారు ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులను ఎంతమేర ఎదుర్కొంటారనే సందేహం నెలకొంది. ఇక నాన్-లోకల్ అభ్యర్థికి సీటు ఇస్తే స్థానిక పార్టీ శ్రేణుల్లో తీవ్ర వ్యతిరేకతను తీసుకొచ్చే అంశంగా మారుతుందని తెరాస అధిష్టానం భావిస్తోంది. దీంతో నాగార్జున సాగర్ టికెట్ టీఆర్ఎస్ గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోందని రాజకీయ విమర్శకులు అంటున్నారు.

ఏదేమైనా దుబ్బాక రిజల్ట్ మరోసారి రిపీట్ కాకుండా ఉండేందుకు వ్యూహాలు రచించే పనిలో పడింది తెరాస పార్టీ. మరి ఈసారి కేసీఆర్ నాగార్జున సాగర్ ఉప-ఎన్నికను లైట్ తీసుకుంటారా లేక ప్రతిపక్ష పార్టీలను ఢీకొట్టేందుకు ప్రచారపర్వంలో స్వయంగా పాల్గొంటారా అనేది చూడాలి.