కడియం శ్రీహరి ఫై తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి పై టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి మంత్రిగా ఉన్న సమయంలో దాదాపు 361 మంది నక్సలైట్లను పొట్టన పెట్టుకున్నారని తాటికొండ రాజయ్య మాటల దాడి చేశారు. ఒక స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోనే ఇంత మంది చనిపోయారని రాజయ్య అన్నారు. జనగామ జిల్లా చిల్పూరు మండలం చిన్నపెండ్యాలలో కొత్త పింఛన్‌దారులకు సోమవారం ఆయన కార్డులు అందజేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజయ్య మాట్లాడుతూ.. తనకు రాజకీయ గురువు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అయితే ప్రస్తుత సీఎం కేసీఆర్‌ దేవుడని అన్నారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గానికి తాను పూజారినని, ఆ దేవుడిచ్చే వరాలతోనే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నానని తెలిపారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎప్పటికీ తన అడ్డా అని.. అక్కడ ఎవరినీ కాలు పెట్టనీయనని శపథం చేశారు. ఇక ఇప్పటికే స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో తాటికొండ రాజయ్యకు, కడియం శ్రీహరికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని టిఆర్ఎస్ పార్టీలో ఉన్న ఇద్దరు నేతలు టికెట్టు తమకే రావాలని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.