హుజూరాబాద్, బద్వేల్‌లో ముగిసిన ప్రచారం

హుజూరాబాద్, బద్వేల్‌లో ముగిసిన ప్రచారం

గత మూడు నెలలుగా హోరెత్తించిన మైకులు కొద్దిసేపటి క్రితం మూగబోయాయి. ఉత్కంఠభరితంగా సాగిన హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. అక్టోబర్ 27 సాయంత్రం 7 గంటలకు ప్రచార పర్వానికి ముగింపు పలికారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు, ముఖ్యనేతలు గెలుపు కోసం గత కొద్దీ నెలలుగా తీవ్రంగా కృషి చేశారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ అన్నీ తానై ప్రచారంలో పాల్గొనగా.. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు తోడుగా హరీశ్ ప్రచారంలో పాల్గొన్నారు. చివర్లో కాంగ్రెస్ సైతం తమ అభ్యర్థిని ప్రకటించి ప్రచారం చేసింది. కానీ ఈ ఉప ఎన్నిక బరిలో తెరాస , బిజెపి ల మద్యే అసలైన పోటీ నెలకొంది. ఈసీ ఆదేశాలతో హుజరాబాద్ నియోజకవర్గం తో పాటు బద్వేల్ ఉప ఎన్నికకు 72 గంటల ముందే ఎన్నికల ప్రచారం ముగిసింది.

ఈ నెల 30న పోలింగ్‌ జరగనుంది. నవంబర్‌ 2న ఓట్లు లెక్కిస్తారు. 30న ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పోలింగ్‌ నిర్వహిస్తారు. బద్వేల్‌ ఉపఎన్నిక బరిలో 15 మంది అభ్యర్థులు నిలిచారు. హుజురాబాద్‌ బరిలో 30 మంది అభ్యర్థులు పోటీ ఉన్నారు. హుజురాబాద్‌లో మొత్తం ఓటర్లు 2,36,283 అందులో పురుష ఓటర్లు 1,18,720; మహిళా ఓటర్లు 1,17,563 .

బద్వేల్‌ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,15,292 కాగా , పురుష ఓటర్లు 1,07,915; మహిళా ఓటర్లు 1,07,355 .