టీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది

టీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు టిఆర్ఎస్ పార్టీ కి గుడ్ బై చెప్పి బిజెపి , కాంగ్రెస్ పార్టీ లలో చేరగా..తాజాగా మరో షాక్ టిఆర్ఎస్ తగిలింది. ఢిల్లీలో టీఆర్ఎస్ మాజీ ప్రత్యేక ప్రతినిధి, మాజీ ఐఏఎస్ రామచంద్రు తేజావత్ పార్టీ కి గుడ్ బై చెప్పారు.

ఇటీవల కాలంలో తెలంగాణ ప్రభుత్వం, పార్టీ తీసుకున్న నిర్ణయాలు నచ్చకపోవడంతోనే రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ తరపున బరిలో నిలిచిన అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వకూడదని టీఆర్ఎస్ నిర్ణయం తీసుకోవడం తనకు బాధ కలిగించిందని, అందుకే టీఆర్‌ఎస్ పార్టీతో తెగదెంపులు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. టీఆర్‌ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని..తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని తేజావత్ రామచంద్రు కోరారు. పార్టీకి, ప్రభుత్వానికి మరెంతో సేవ చేద్దామని అనుకున్నా..కానీ​ టీఆర్‌ఎస్ పార్టీ, ప్రభుత్వం తన సేవలను వినియోగించుకోలేదని తేజావత్ రామచంద్రు అన్నారు.

ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గవర్నమెంట్తో పాటు టీఆర్ఎస్ పార్టీలో తనను భాగస్వామ్యం చేసినందుకు రామచంద్రు ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా తన విధులు వంద శాతం అంకితభావంతో నిర్వర్తించానని చెప్పారు. ముఖ్యంగా కాళేశ్వరం, SRSP స్ట్రోమ్ వాటర్ ప్రాజెక్ట్ లకు అన్ని క్లియరెన్స్ వచ్చేందుకు కృషి చేసినట్లు చెప్పారు. అలాగే సికింద్రాబాద్ కరీంనగర్ రైల్వే లైన్, 3100 కిలో మీటర్ల నేషనల్ హైవే ప్రాజెక్టులు, ఎయిమ్స్, భద్రాద్రి పవర్ ప్రాజెక్టులు సాధించడంలో తన వంతు పాత్ర పోషించాననన్నారు.

టీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన రామ‌చంద్రుడు త్వ‌ర‌లోనే బీజేపీలో చేర‌నున్న‌ట్లు ప్రచారం సాగుతోంది. దీనిపై అంత‌గా స్ప‌ష్ట‌త లేకున్నా… బీఎస్పీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ మాత్రం రామ‌చంద్రుడు టీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన వైనాన్ని కీర్తించారు. ఇప్ప‌టికైనా టీఆర్ఎస్‌, కేసీఆర్ నిజ‌స్వ‌రూపాన్ని తెలుసుకుని సంకెళ్లు తెంచుకుని రామ‌చంద్రుడు బ‌య‌ట‌ప‌డ్డార‌న్నారు. ఆత్మ గౌర‌వానికి మించిన ఆభ‌ర‌ణం లేద‌ని సూచించిన ప్ర‌వీణ్‌ టీఆర్ఎస్ వ‌ద్ద ద‌గా ప‌డ్డ నాయ‌కులంతా ఈ విష‌యాన్ని గుర్తించాల‌ని, దొర‌ల పోక‌డ‌ల‌పై పోరాడాల‌ని పిలుపునిచ్చారు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు స‌మ‌యం స‌మీపిస్తున్న త‌రుణంలో అధికార పార్టీ గ‌ట్టి ఎదురు దెబ్బ తగిలింది.