రాహుల్ యాత్రలో టీఆర్‌ఎస్‌ ఫ్లెక్సీలు చించివేత

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టి భారత్ జోడో యాత్ర తెలంగాణాలో ప్రవేశించింది. ఈరోజు ఉదయం తెలంగాణ లో అడుగుపెట్టారు రాహుల్. మొదటి రోజు కేవలం 4 కిలోమీటర్లు మాత్రం పాదయాత్ర చేసి ముగించారు. తిరిగి ఈ నెల 27 న యాత్ర మొదలుపెట్టనున్నారు. రాహుల్‌ జోడో యాత్రలో కాంగ్రెస్ కార్యకర్తలు కొంత మంది అత్యుత్సాహం ప్రదర్శించారు. టీఆర్ఎస్ నాయకులు ఏర్పాటుచేసుకున్న ఫ్లెక్సీలను చింపివేయడం వివాదాస్పదమైంది. కర్ణాటక నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే చోట కర్ణాటకకు చెందిన పలువురు అభిమానులు ముఖ్యమంత్రి కేసీఆర్, స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పేరు మీద భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. జోడో యాత్ర కొనసాగే ఈ మార్గంలో కేసీఆర్ ఫ్లెక్సీ రాహుల్‌గాంధీ కంటపడకుండా ఉండాలని స్థానిక కాంగ్రెస్‌ నేతలు ఆ ఫ్లెక్సీని చింపేశారు. తాము ఏర్పాటు చేసుకున్న బ్యానర్లు, ఫ్లెక్సీలను చించే అధికారం కాంగ్రెస్‌ నేతలకు ఎక్కడిదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే పాదయాత్ర ఫై కొంతమంది విమర్శలు చేస్తున్నారు.

మావోయిస్టుల చేతిలో దారుణహత్యకు గురైన కాంగ్రెస్ మక్తల్ మాజీ ఎమ్మెల్యే నర్సిరెడ్డి విగ్రహాన్ని కూడా కాంగ్రెస్ నేతలు పట్టించుకోలేదని , విగ్రహానికి కనీసం పూలమాల వేయాలన్న సోయి కూడా వీరికి లేకపోయిందని విమర్శిస్తున్నారు. పాదయాత్రలో భాగంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఆ పార్టీ నేతలు ఏర్పాట్లు చేశారు. అయితే రాహుల్ గాంధీ తెలంగాణలో నాలుగు కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసినా.. తెలంగాణ తల్లి విగ్రహం వైపు కన్నెత్తి చూడలేదు. స్థానిక కాంగ్రెస్‌ నేతలు కూడా ఆవిష్కరణ విషయాన్ని పట్టించుకోలేదని వాపోయారు.