పండగవేళ జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

దీపావళి సంబరాలను ఎంతో ఆర్బాటంగా జరుపుకోవాల్సిన ఆ కుటుంబాల్లో విషాద ఛాయలు అల్లుకున్నాయి. జగిత్యాల జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. జిల్లాలోని వెల్గటూరు మండలంలో మందమర్రికి చెందిన బొడ్డు సుధ(38) ,ఆమె కూతురు బొడ్డు ప్రిన్సిత(15), రేణికుంట మిల్కారాణి(15) ధర్మపురి మండలం ధర్మారంలోని చర్చికి ఆటోలో బయలు దేరారు. మార్గమధ్యలో మంచికట్ల పుష్ప అనే ప్రయాణికురాలిని ఎక్కించుకున్నారు.

రాయపట్నం రాష్ట్ర రహదారిపై కిషన్ రావు పేట స్టేజి వద్ద ఎదురుగా వచ్చిన కారు ఆటోను ఢీకొట్టింది. ప్రమాదంలో సుధ, ప్రిన్సిత, మిల్కారాణి అక్కడికక్కడే మృతి చెందగా ఆటో డ్రైవర్‌ ప్రభాకర్‌, ప్రయాణికురాలు పుష్పకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం హుటాహుటినా కరీంనగర్‌ ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టానికి పంపిణి , ప్రమాదం ఫై కేసు నమోదు చేసారు.