రేవంత్ రెడ్డి ఇంటివద్ద ఉద్రిక్తత..కాంగ్రెస్ , టిఆర్ఎస్ కార్యకర్తల దాడులు

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటివద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కేటీఆర్‌ పై రేవంత్ చేసిన డ్రగ్స్ ఆరోపణలకు నిరసనగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలు రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి ప్రయత్నం చేశారు. దీంతో రేవంత్ రెడ్డి మద్దతు దారులకు మరియు టీఆర్ఎస్ కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకుంది.

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు తక్షణమే సంఘటన స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు. వారు వినకపోవడంతో స్వల్ప లాఠీ చార్జ్ చేసి.. ఇరు వర్గాలను చెల్లా చెదురు చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇరు వర్గాల వారించి గొడవను సద్దుమణిగించే ప్రయత్నం చేశారు. మరోవైపు రేవంత్‌రెడ్డిపై మంత్రి కేటీఆర్‌ సోమవారం సిటీ సివిల్‌ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. అసత్య, నిరాధార ఆరోపణలు చేసిన ఆయన.. సోషల్ మీడియా, ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాల్లోనూ, బహిరంగంగానూ బేషరతు క్షమాపణ చెప్పేలా ఆదేశాలివ్వాలంటూ కోర్టును అభ్యర్థించారు.