వరంగల్ జిల్లాలో దసరా రోజు విషాదం..

అప్పటివరకు దసరా సంబరాల్లో మునిగితేలిన ఆయా కుటుంబాలు ఒక్కసారిగా విషాదంలో పడిపోయాయి. పంటపొలాల్లో మద్యం సేవిస్తున్న యువకుల ఫై పిడుగు పడిన ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదం లో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోగా , పలువురికి గాయాలు అయ్యాయి.

వివరాల్లోకి వెళ్తే..

వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం బండౌతాపురం గ్రామ శివారులో స్నేహితులంతా కలసి పార్టీ చేసుకుంటుండగా ఉరుములు.. మెరుపులతో పిడుగుపడింది. పిడుగు పడిన ధాటికి మరుపట్ల సాంబరాజు, బాలగాని హరికృష్ణ, శివ కృష్ణ అనే యువకులు మృతి చెందగా మరో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలాన్ని సందర్శించి గాయపడిన వారిని వర్థన్నపేట ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. ఊరు.. ఊరంతా పండుగ సంబరంలో మునిగి తేలుతున్న తరుణంలో పిడుగుపడి ముగ్గురు మృతి చెందిన ఘటన ఆయా కుటుంబాల్లో విషాదం రేపింది.