హైదరాబాద్ లో నేటి నుంచి కఠినంగా మారిన ట్రాఫిక్స్ రూల్స్

హైదరాబాద్‌లో నేటి నుండి ట్రాఫిక్‌ రూల్స్‌ మరింత కఠినతరం కానున్నాయి. నేటి నుంచి స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్‌ నియమాలను ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు తప్పవని అధికారులు హెచ్చరించారు. రాంగ్‌సైడ్‌ డ్రైవింగ్‌, ట్రిపుల్‌ రైడింగ్‌ చేస్తే పెద్దమొత్తం జరిమానాలు విధించనున్నారు. ఈ మధ్యకాలంలో నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదాలపై ట్రాఫిక్‌ పోలీసులు అధ్యయనం చేయగా.. ఈ రెండు ఉల్లంఘనల వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించారు.

దీంతో ఉల్లంఘనలకు పాల్పడుతున్న వాహనదారులతో పాటు పాదచారులు కూడా ప్రమాదాలకు గురవుతున్నట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలో గత వారం రోజులుగా ఈ ఉల్లంఘనలపై అవగాహన కల్పించిన ట్రాఫిక్‌ పోలీసులు.. సోమవారం నుంచి స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. రాంగ్ రూట్ డ్రైవింగ్ పై 1700 రూపాయలు, ట్రిపుల్ రైడింగ్ పై 1200 రూపాయలు ఫైన్ వేయనున్నారు. ఇక జీబ్రా లైన్‌ దాటితే రూ.100, ఫ్రీ లెఫ్ట్‌కు అడ్డుపడితే రూ.వెయ్యి జరిమానా విధించనున్నారు. అయితే ద్విచక్ర వాహనాలు, ఆటోలతో ప్రమాదాలుగా తక్కువగా ఉన్న నేపథ్యంలో.. వాటిపై విధించే జరిమానాలు కూడా తక్కువగానే ఉంటాయని అధికారులు చెప్పారు. భారీ వాహనాలు రాంగ్‌రూట్‌లో రావడంతో నష్టం కూడా అదే స్థాయిలో ఉంటుందన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని బైక్‌లు, ఆటోలకు విధించే జరిమానాలతో పోలిస్తే.. భారీ వాహనాలకు విధించే జరిమానాలు ఎక్కువేనని చెప్పారు.