రేపు టీఆర్ఎస్ ప్లీనరీ నేపథ్యంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

రేపు (అక్టోబర్ 25) హైటెక్స్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఈ సమావేశానికి రాష్ట్ర నలుమూలల నుంచి అధిక సంఖ్యలో ప్రముఖులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరవుతుండటంతో హైటెక్స్‌ పరిసరాలలో భారీగా ట్రాఫిక్‌ రద్దీ ఏర్పడే అవకాశాలున్నాయని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు.

గచ్చిబౌలి జంక్షన్‌కు సైబర్‌ టవర్స్‌ మీదుగా వెళ్లేవారు అయ్యప్ప సొసైటీ సీవోడీ జంక్షన్‌, దుర్గం చెరువు నుంచి వెళ్లాల్సిందిగా అధికారులు సూచించారు. అంతేకాకుండా కొండాపూర్‌, ఆర్సీపురం, చందానగర్‌ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లే వాహనదారులు.. బీహెచ్‌ఈఎల్‌, నల్లగండ్ల, హెచ్‌సీయూ మీదుగా వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. దీంతో పాటు హఫీజ్‌పేట, మియాపూర్‌, కొత్తగూడ నుంచి సైబర్‌ టవర్స్‌ మీదుగా జూబ్లీహిల్స్‌ వైపు వెళ్లే వారు రోలింగ్‌ హిల్స్, ఐకియా, ఇనార్బిట్‌ మాల్‌ నుంచి వెళ్లాల్సిందిగా అధికారులు సూచించారు.