ఏలేటి మహేశ్వర్ రెడ్డికి టీపీసీసీ షాక్

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డికి టీపీసీసీ షాక్ ఇచ్చింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. గంటలోపు షోకాజ్ నోటీసులకు సమాధానం ఇవ్వాలని.. ఇవ్వకపోతే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

మంగళవారం నిర్మల్ నియోజకవర్గంలో తన అనుచరులతో మహేశ్వర్ రెడ్డి సీక్రెట్ మీటింగ్ నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. సమావేశంలోకి ఫోన్లను తెచ్చుకునేందుకు అనుమతి నిరాకరించారు. దీంతో ఈ సమావేశం నియోజకవర్గ కాంగ్రెస్‌లో దుమారం రేపింది. పార్టీ మార్పుపై చర్చించేందుకు అనుచరులతో మహేశ్వర్ రెడ్డి రహస్య భేటీ నిర్వహించారనే ప్రచారం జరుగుతోంది. బీజేపీలో చేరే విషయంపై ఆయన అనుచరులతో చర్చించారనే వార్తలు మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి.ఈ క్రమంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ టీపీసీసీ నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుందని చెప్పవచ్చు.

గత కొంతకాలంగా టీ కాంగ్రెస్‌లో మహేశ్వర్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రేవంత్ రెడ్డి నిర్ణయాలను బహిరంగంగా వ్యతిరేకిస్తున్న మహేశ్వర్ రెడ్డి.. పార్టీ కార్యక్రమాల్లో కూడా అంత యాక్టివ్‌గా ఎక్కడా పాల్గొనడం లేదు. గతంలో రేవంత్‌కు పోటీగా ఆయన పాదయాత్ర చేపట్టడం గుబులు రేపింది. కానీ అధిష్టానం పాదయాత్ర ఆపేయాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడంతో మధ్యలోనే పాదయాత్రకు బ్రేక్ పడింది. ఈ నిర్ణయం మహేశ్వర్ రెడ్డిలో అసంతృప్తిని మరింత పెంచిందనే వాదనలు ఉన్నాయి. కాంగ్రెస్ బలోపేతం కోసం తాను పాదయాత్ర చేపట్టానని, తన పాదయాత్రను మధ్యలో ఆపేయాలని చెప్పడం సరికాదంటూ ధిక్కార సర్వం వినిపించారు.