హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటెల భారీ విజయం

ఎంతో ఉత్కంఠగా సాగిన హుజురాబాద్ ఉప ఎన్నికలో బిజెపి పార్టీ తరుపున బరిలో దిగిన ఈటెల రాజేందర్ భారీ మెజార్టీ తో విజయ ఢంకా మోగించారు. టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెళ్లు శ్రీనివాస్ పై ఏకంగా 23,865 ఓట్ల మెజారిటీతో ఈటల రాజేందర్ విజయం సాధించారు. ఈటల రాజేందర్‌.. హుజురాబాద్‌ నియోజకవర్గం నుంచి విజయం సాధించడం ఇది ఏడో సారి కావడం విశేషం.

2004 నుంచి వరుసగా గెలుస్తూ వచ్చారు. మూడుసార్లు ఉప ఎన్నికల్లో.. నాలుగు సాధారణ ఎన్నికల్లో గెలిచి సత్తా చాటారు. అధికార పార్టీ నుంచి వీడి.. కమలతీర్థం పుచ్చుకున్న ఈటల కాషాయం కండువాతో శాసనసభలో అడుగుపెట్టనున్నారు. స్థానికంగా బలమైన నాయకుడు కావడం.. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసిన సేవలు ఈటల విజయానికి కలిసివచ్చాయి. భాజపాలో చేరడం.. తెరాసకు రాష్ట్రంలో ప్రత్యామ్నాయం తామే అనే సంకేతాలు రాజేందర్‌కు పట్టం కట్టడంలో దోహదం చేశాయని రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. రాజేందర్ గెలుపుతో అభిమానులు , బిజెపి శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.