బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్..

rajasingh

బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజాసింగ్ పోస్టు చేసిన ఓ వీడియో దుమారం రేపింది. ఆ వీడియోలో ప్ర‌వ‌క్త‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు బుక్ చేశారు. సోమ‌వారం రాత్రి న‌గ‌రంలో ఓ వ‌ర్గం ప్ర‌జ‌లు నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు చేపట్టారు. సిటీ పోలీసు క‌మీష‌న‌ర్ సీవీ ఆనంద్ ఆఫీసుతో పాటు ఇత‌ర ప్ర‌దేశాల్లో ప్ర‌ద‌ర్శ‌న‌లు జ‌రిగాయి. మ‌తమ‌నోభావాల‌ను రాజా సింగ్ అవ‌మానించిన‌ట్లు ఆందోళ‌న‌కారులు ఆరోపించారు.

మహమ్మద్‌ ప్రవక్తపై రాజాసింగ్ విడుదల చేసిన వివాదాస్పాద వీడియో యూట్యూబ్ నుండి తొలగించారు. హైదరాబాద్ పోలీసుల విజ్ఞప్తి మేరకు రాజాసింగ్ వివాదాస్పద వీడియోని తొలగించింది యూట్యూబ్. అయితే దీనిపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ.. రాముడిని కించపరుస్తూ షో చేసిన మునావర్ ఫారుఖీని హైదరాబాద్ కు వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని‌ హెచ్చరించినా షో జరిపించారని ఆగ్రహించారు. పోలీసులకు ముందే దండం పెట్టి వేడుకున్నా వినలేదని.. రాముడిని కించపరిచిన వ్యక్తికి పోలీసలు ఎలా రక్షణ కల్పిస్తారని మండిపడ్డారు. మునావర్ ఫారుఖికి కౌంటర్ విడియోలు చేస్తానని ముందే చెప్పానని.. అలా చేసిన వీడియోను యూట్యూబ్ లో తొలగించారని ఫైర్‌ అయ్యారు. రెండో భాగం వీడియో త్వరలో అప్ లోడ్ చేస్తానని ప్రకటించారు. యాక్షన్ కు రియాక్షన్ కచ్చితంగా ఉంటుందని.. నాపై ఎలాంటి చర్యలకు దిగిన నేను రెడీ అని ఛాలెంజ్‌ చేశారు. ధర్మం కోసం నేను చావడానికైనా సిద్ధమన్నారు రాజాసింగ్‌.

ఇక నిన్నటి నుండి MIM కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతుండడంతో పోలీసులు పెద్ద ఎత్తున రాజాసింగ్ ఇంటి వద్ద పోలీసులు చేరుకొని ఆయన్ను అరెస్ట్ చేశారు.