తిరుపతి ‘వందే భారత్‌’ రైలు టైమింగ్ లో మార్పులు..

తిరుపతి వెళ్లే ప్రయాణికులకు రైల్వే అధికారులు గుడ్ న్యూస్ తెలిపారు. తిరుపతి ‘వందే భారత్‌’ రైలు బోగీల సంఖ్యను పెంచారు. ప్రస్తుతం 8 కోచ్‌లతో నడుస్తుండగా.. ఆ సంఖ్యను 16కు పెంచారు. అంతేకాదు కోచ్‌ల సంఖ్య పెరగడంతో సీట్ల సంఖ్య 530 నుంచి 1036కి పెరగనుంది. ఈ నెల (మే) 17 నుంచి 16 బోగీలతో వందేభారత్ నడవనుంది. అలాగే రైలు బయల్దేరే వేళల్లో కూడా స్వల్ప మార్పులు చేసినట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు.

ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి ఉదయం 6 గంటలకు తిరుపతికి బయల్దేరుతుంది. కానీ ఈ నెల (మే) 17 నుంచి ఈ రైలు పావుగంట ఆలస్యంగా.. అంటే ఉదయం 6.15 నిమిషాలకు బయల్దేరనుంది. ఈ మార్పులకు తగినట్లుగానే మిగిలిన స్టేషన్‌లలో ఆగే సమయంలో కూడా మార్పులు జరిగాయి. నల్గొండకు ఉదయం 7.30కు చేరుకుంటుంది.. గుంటూరుకు 9.40.. ఒంగోలు 11.10.. నెల్లూరు మధ్యాహ్నం 12.30 గంటలకు చేరుతుంది. తిరుపతికి మధ్యాహ్నం 2.30 గంటలకు చేరుకుటుంది. అటు తిరుపతి నుంచి మధ్యాహ్నం 3.15గంటలకు సికింద్రాబాద్ బయల్దేరుతుంది.. రాత్రి 11.30గంటలకు సికింద్రాబాద్‌ చేరనుంది.