అగ్రరాజ్యంలో 19 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు

మేరీల్యాండ్‌లో 13 ఎకరాల విస్తీర్ణంలో అంబేద్కర్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్

19-foot-ambedkar-statue-named-statue-of-equality-to-be-unveiled-in-us

వాషింగ్టన్‌ః అగ్రరాజ్యం అమెరికాలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ కు అరుదైన గౌరవం లభించనుంది. అమెరికా లో అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించారు. ఆయన సిద్ధాంతాలు ప్రతిబింబించేలా రూపొందించిన 19 అడుగుల విగ్రహం ఆవిష్కరణకు సిద్ధమైంది. భారత్ అవతల ఏర్పాటు చేస్తున్న అంబేద్కర్ అతి పెద్ద విగ్రహం ఇదే కానుంది. మేరీల్యాండ్‌లోని అకోకీక్‌ నగరంలో 13 ఎకరాల భారీ విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్ లో భాగంగా ఈ విగ్రహాన్ని నిర్మించారు. ‘స్టాట్యూ ఆఫ్‌ ఈక్వాలిటీ’గా నామకరణం చేసిన ఈ విగ్రహాన్ని అక్టోబరు 14న ఆవిష్కరించనున్నారు.

ఈ స్మారక చిహ్నం అంబేద్కర్‌ బోధనలు, సిద్ధాంతాలను వ్యాప్తి చేసే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశారు. సమానత్వం, మానవ హక్కులకు చిహ్నంగా దీన్ని చూస్తున్నట్లు ఏఐసీ వివరించింది. ఈ కార్యక్రమానికి అమెరికాతో పాటు ప్రపంచ దేశాల ప్రతినిధులు హాజరుకానున్నట్లు ఏఐసీ తెలిపింది. గుజరాత్‌లోని సర్దార్‌ పటేల్‌ విగ్రహాన్ని డిజైన్‌ చేసిన ప్రముఖ విగ్రహ రూపశిల్పి రామ్ సుతార్‌ ఈ విగ్రహాన్ని రూపొందించారు.