కాంగ్రెస్ నన్ను 91 సార్లు దుర్భాషలాడింది.. ఖర్గే వ్యాఖ్యలపై ప్రధాని కౌంటర్

తనను తిట్టిన ప్రతిసారి ఆ పార్టీ పతనమవుతోందని వెల్లడి

Till Now Congress Have Abused Me 91 Times In Different Ways: PM Modi

బెంగళూరుః కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ రాష్ట్రంలో ప్రధాని మోడీ పర్యటిస్తున్నారు. ఈ రోజు బీదర్ జిల్లాలోని హమ్నాబాద్ లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తనను ‘విష సర్పం’ అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు, కర్ణాటకకు చెందిన మల్లికార్జున ఖర్గే చేసిన విమర్శలను ఉద్దేశించి పరోక్షంగా మోడీ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఇప్పటికి తనను 91 సార్లు తిట్టిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ‘‘కాంగ్రెస్ పార్టీ మళ్లీ నన్ను నిందించడం ప్రారంభించింది. నన్ను నిందించిన ప్రతిసారి ఆ పార్టీ పతనమవుతోంది. తిట్టే పనిని కాంగ్రెస్ చేసుకోనివ్వండి.. నేను మాత్రం కర్ణాటక ప్రజల కోసం పని చేస్తాను’’ అని ఆయన చెప్పారు.

‘‘వాళ్లు నన్ను తిట్టారు. లింగాయత్ వర్గాన్ని నిందించారు. అంబేద్కర్, వీర్ సావర్కర్ ను కూడా అవమానించారు. వాళ్లకు ప్రజలు ఓట్లతోనే బదులిస్తారు’’ అని ప్రధాని అన్నారు. బిజెపిపై ఎంత బురద జల్లితే.. కమలం (పార్టీ గుర్తు) అంతగా వికసిస్తుందని చెప్పారు. కర్ణాటకలో జరుగుతున్న ఎన్నికలు.. ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాదని, ఈ రాష్ట్రాన్ని దేశంలో నంబర్ వన్ గా చేయడానికని చెప్పుకొచ్చారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉంటే.. రాష్ట్రం డబుల్ స్పీడ్ తో దూసుకుపోతుందని మోడీ తెలిపారు.