దుండిగల్ లో పులి సంచారం..?

Tiger roaming in Dundigal..?

హైదరాబాద్ శివారు ప్రాంతం దుండిగల్ లో పులి సంచరిస్తున్నట్లు వార్తలు వైరల్ గా మారాయి. దుండిగల్‌ మున్సిపాలిటీ బౌరంపేట్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు సమీపంలోని అటవి ప్రాంతంలో చిరుత పులి సంచరించినట్లు వదంతులు వచ్చాయి. దీంతో స్థానిక బౌరంపేటతో పాటు చుట్టు పక్కల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.

ఈ విషయం తెలుసుకున్న సూరారం సెక్షన్‌ అటవీ శాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, బీట్‌ అధికారి హర్షద్‌లు స్థానికంగా పర్యటించి పాదముద్రలు సేకరించారు. బహదూర్‌పూర జూపార్క్‌లోని ఉన్నతాధికారులకు నివేదించారు. అయితే సంబంధిత అధికారులు మాత్రం అవి పులి పాద ముద్రికలు కావని, కుక్క పాదాలని నిర్ధారించినట్లు సమాచారం. స్థానికంగా ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కావద్దని అటవీ శాఖ అధికారులు తెలిపారు. అయితే స్థానికులు చెబుతున్న వర్షన్ కి, ఫారెస్ట్ సిబ్బంది చెబుతున్న వర్షన్ కి చాలా తేడా ఉంది. గడిచిన కొద్ది రోజులుగా పులి సంచారిస్తుందని స్థానికులు చెబుతున్నారు. కానీ ఫారెస్ట్ అధికారులు మాత్రం ఆ విషయాన్ని కొట్టిపారేస్తున్నారు.