ఏపీలో బిఆర్ఎస్ పోటీ చేసే స్థానాలపై తోట చంద్రశేఖర్ క్లారిటీ

ఏపీలో బిఆర్ఎస్ పోటీ చేసే స్థానాలపై ఏపీ బిఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ సీఎం , BRS అధినేత కేసీఆర్..ప్రస్తుతం దేశ వ్యాప్తంగా బిఆర్ఎస్ ను విస్తరించే పనిలో ఉన్నారు. ఇప్పటికే మహారాష్ట్ర లో భారీ సభలు నిర్వహించి పెద్ద ఎత్తున నేతలను బిఆర్ఎస్ లో ఆహ్వానించగా, ఏపీ ఫై కూడా పూర్తి ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా మూడు రోజుల పాటు ఏపీలో BRS ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు మొదలుపెట్టారు.

మొదటిరోజు విశాఖ వేదికగా బీఆర్ఎస్‌ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా.. తోట చంద్రశేఖర్ సారథ్యంలో పలువురు నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్‌లో చేరారు. ఇక ఈ కార్యక్రమంలో తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ.. విశాఖ స్టీల్‌ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకుని తీరుతామన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పోరాటంలో ఏపీలోని పార్టీలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆరోపించారు.

ఇటీవల మంత్రి కేటీఆర్ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రధానికి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పారని గుర్తు చేసారు. ఆదివారం గోదావరి జిల్లాల్లో పర్యటించిన తోట చంద్రశేఖర్.. ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తమ పార్టీలో చేరబోతున్నట్లు తెలిపారు. ఏపీలో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, 25 పార్లమెంట్ స్థానాల్లో పార్టీ పోటీ చేస్తుందని క్లారిటీ ఇచ్చారు.