నేడు స్టేషన్‌ ఘన్‌పూర్‌, మానకొండూరు, నకిరేకల్‌, నల్లగొండలో సిఎం కెసిఆర్‌ ప్రజా ఆశీర్వాద సభ

CM KCR

హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయపార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అగ్ర నాయకులు రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. అందరికంటే ముందే అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకెళ్తున్న బిఆర్‌ఎస్ మ్యానిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్తున్నది. ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రతిరోజూ నాలుగు ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటూ గులాబీ కార్యకర్తల్లో జోష్‌ నింపుతున్నారు. ఇందులో భాగంగా సోమవారం జనగామ, కరీంనగర్‌, నల్లగొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌, మానకొండూరు, నకిరేకల్‌, నల్లగొండ ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటారు.

మధ్యాహ్నం 12.30 గంటలకు స్టేషన్‌ఘన్‌పూర్‌ సభకు ముఖ్యమంత్రి హాజరవుతారు. హైదరాబాద్‌-వరంగల్‌ హైవేపై మీదికొండ క్రాస్‌రోడ్డులోని శివారెడ్డిపల్లి శివారులో ఏర్పాటుచేసిన ప్రజాఆశీర్వాద సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. బిఆర్‌ఎస్‌ అభ్యర్థి కడియం శ్రీహరికి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తారు. అనంతరం మానకొండూరు బయల్దేరుతారు. మధ్యాహ్నం 2 గంటలకు మానకొండూరు నియోజకవర్గంలోని తిమ్మాపూర్‌ మండలం ఎల్‌ఎండీ కాలనీలోని శ్రీచైతన్య ఇంజినీరింగ్‌ కళాశాల ఆవరణలో నిర్వహించే సభలో మాట్లాడుతారు.

మధ్యాహ్నం 3 గంటలకు స్టేషన్‌ ఘన్‌పూర్‌ నుంచి నకిరేకల్‌కు చేరుకుంటారు. నకిరేకల్‌లోని మూసీ రోడ్డులో ఏఎమ్మార్పీ కాల్వ పక్కనే విశాలమైన ప్రదేశంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు. పార్టీ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య తరఫున ప్రచారం నిర్వహిస్తారు. సాయంత్ర 4 గంటలకు నల్లగొండకు బయల్దేరుతారు. పట్టణంలోని మర్రిగూడ బైపాస్‌ రోడ్డులో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభకు హాజరవుతారు. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో మొత్తం 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రచారం పూర్తికానున్నది. మంగళవారం సూర్యాపేటలో మంత్రి జగదీశ్‌ రెడ్డి తరఫున ప్రచారం నిర్వహిస్తారు.