నిరసనలు , ఆందోళనలతో దద్దరిల్లుతున్న తెలుగు రాష్ట్రాలు

రెండు తెలుగు రాష్ట్రాలు నిరసనలు , ఆందోళనలతో అట్టుడికిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉచిత కరెంట్ ఫై చేసిన వ్యాఖ్యలపై BRS శ్రేణులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు, ఆందోళనలు , దిష్టిబొమ్మలు తగలపెట్టడం చేస్తుంటే..ఏపీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. వాలంటీర్ల ఫై చేసిన వ్యాఖ్యలపై వైస్సార్సీపీ శ్రేణులు, వాలంటీర్లు నిరసనలు చేస్తున్నారు. పవన్‌పై వైస్సార్సీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై జనసేన నేతలు నిరసన తెలుపుతున్నారు.

నిరసన సమయంలో జనసేన నేతలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సీఎం దిష్టిబొమ్మను దగ్దం చేసే ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. వాలంటీర్లు, ప్రభుత్వ ఉద్యోగులు కానప్పుడు.. ప్రజల సమాచారం ఎలా తీసుకుంటారని పవన్ ప్రశ్నించారు. MRO తప్పు చేస్తే పై అధికారికి కంప్లైంట్ చేయొచ్చు.. మరి వాలంటీర్లు తప్పు చేస్తే ఎవరికి చెప్పాలని ప్రశ్నించారు. ఇక వాలంటీర్లకు ప్రజల డబ్బుతో జీతాలు ఇస్తున్నారన్న పవన్.. కంప్లైంట్‌ కోసం వాట్సాప్ గ్రూప్, టోల్‌ ఫ్రీ నెంబర్ పెట్టాలన్నారు.

ఇటు తెలంగాణ లో వ్యవసాయానికి 3 గంటల కరెంట్‌ సరిపోతుందని పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై రైతులు, బీఆర్‌ఎస్‌ శ్రేణులు భగ్గుమన్నారు. బీఆర్‌ఎస్‌ సర్కార్‌ ఇస్తున్న ఉచిత కరెంట్‌కు ఉరి వేస్తారా? అంటూ మండిపడ్డారు. రేవంత్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా రెండో రోజు ఆందోళనలు చేపట్టారు. ఊరూరా రేవంత్ రెడ్డి‌, కాంగ్రెస్‌ పార్టీ దిష్టిబొమ్మలు దహనం చేశారు. రేవంత్‌ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని రైతులు డిమాండ్‌ చేశారు. మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలు ఆందోళనలతో అట్టుడికిపోతున్నాయి.