ఆర్కే బీచ్‌లో బ్రిడ్జ్ తెగిపోలేదని అధికారుల వివరణ

The explanation of the authorities is that the bridge at RK Beach is not broken

విశాఖః విశాఖపట్టణం సముద్ర తీరంలోని ఆర్కే బీచ్‌లో మొన్న ప్రారంభించిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ నిన్న తెగిపోయి కొట్టుకుపోయిందంటూ వచ్చిన మీడియా వార్తలు కలకలం రేపాయి. రూ. 1.60 కోట్లతో నిర్మించిన ఈ తేలియాడే వంతెన కథ ఒక్క రోజులోనే ముగిసిపోవడంపై ప్రతిపక్షాలు దుయ్యబడుతున్నాయి. బ్రిడ్జి కొట్టుకుపోయిన సమయంలో సందర్శకులు లేరు కాబట్టి సరిపోయింది కానీ, లేదంటే ఎన్నో ప్రాణాలు సముద్రంలో కలిసిపోయి ఉండేవని విమర్శలు వస్తున్నాయి.

అయితే, బ్రిడ్జ్ తెగిపోయిందంటూ వస్తున్న వార్తలను అధికారులు ఖండించారు. అలాంటిదేమీ లేదని, అలల తీవ్రత ఎక్కువగా ఉండడంతో వంతెనను తొలగించినట్టు తెలిపారు. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఇంకా ట్రయల్ రన్ దశలోనే ఉందని వివరణ ఇచ్చారు. దాని భద్రతపై ఆందోళన అవసరం లేదని పేర్కొన్నారు. సందర్శకులకు లైఫ్ జాకెట్ ఇవ్వడంతోపాటు ఇరువైపులా పడవలతో రక్షణ ఉంటుందని పేర్కొన్నారు.

వాతావరణంలో మార్పుల కారణంగా సముద్ర ప్రవాహాలు తీవ్రంగా ఉండడంతో వంతెనపైకి నిన్న సందర్శకులను అనుమతించలేదని తెలిపారు. నిర్వాహకులు ‘టీ’ పాయింట్ (వ్యూ పాయింట్)ను బ్రిడ్జ్ నుంచి విడదీసి దాని పటిష్ఠతను పరిశీలించేందుకు యాంకర్లకు దగ్గరగా జరిపి నిలిపి ఉంచినట్టు చెప్పారు. ఈ నేపథ్యంలో బ్రిడ్జ్, వ్యూపాయింట్ మధ్య ఖాళీని ఫొటో తీసి వంతెన తెగిపోయిందని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.