ఈ రోజు సాయంత్రంతో ఎన్నికల ప్రచార పర్వానికి తెర

The election campaign will end today in AP

అమరావతిః ఏపీలో ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. రోజులుగా ప్రచార హోరుతో ఏపీ మోతెక్కుతోంది. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ఈ రోజు ఎన్నికల ప్రచారానికి తుది రోజు. ఈ సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగియనుంది. మైకులు మూగబోతున్నాయి. మరోవైపు ముఖ్యమంత్రి జగన్ తన చివరి ప్రచారాన్ని జనసేనాని పవన్ కల్యణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో నిర్వహించబోతున్నారు.

ఈరోజు జగన్ మూడు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటలకు నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోని చిలకలూరిపేట కళామందిర్ సెంటర్ లో జరిగే సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కైకలూరులో, చివరగా కాకినాడ పార్లమెంట్ పరిధిలోని పిఠాపురంలో నిర్వహించే సభల్లో పాల్గొంటారు. పిఠాపురం సభతో ఆయన ప్రచార పర్వం ముగియనుంది.

తొలి నుంచి కూడా పిఠాపురంపై వైసీపీ ఫోకస్ చేసింది. పవన్ కల్యాణ్ పై ఆయన సొంత సామాజికవర్గానికి చెందిన వంగా గీతను బరిలోకి దించింది. తన ప్రచార ప్రసంగాల్లో పవన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న జగన్… పిఠాపురంలో ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది.