తెలంగాణలో ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు

Tenth class exams started in Telangana

హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్ష ప్రారంభమైన ఐదు నిమిషాల వరకు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను అధికారులు అనుమతించారు. క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే విద్యార్థులను పరీక్ష కేంద్రంలో పంపించారు. ఏప్రిల్‌ 2 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2,676 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 5.05 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం కల్పించింది.

కాగా, పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనాన్ని ఏప్రిల్‌ 3 నుంచి 11 వరకు నిర్వహిస్తారు. మొత్తంగా 9 రోజులపాటు స్పాట్‌ వాల్యుయేషన్‌ను నిర్వహించనున్నట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ కృష్ణారావు తెలిపారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 19 స్పాట్‌ వాల్యుయేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మార్చి 23న వాల్యుయేషన్‌ సిబ్బందికి ఓరియంటేషన్‌ను నిర్వహిస్తామని తెలిపారు. 11 పేపర్ల నుంచి 6 పేపర్లకు కుదించడంతో జవాబు పత్రాల సంఖ్య తగ్గనున్నది. దీంతో మూల్యాంకనాన్ని త్వరగా పూర్తిచేసి, ఫలితాలను త్వరగా విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు.