నేడు ఏపీలో పదో తరగతి పరీక్ష ఫలితాల విడుదల

అమరావతి : నేడు ఏపీలో పదో తరగతి పరీక్ష ఫలితాలను విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేస్తారని విద్యాశాఖ డైరెక్టర్‌ దేవానంద్‌రెడ్డి వెల్లడించారు. విజయవాడలోని ఎమ్‌జీ రోడ్‌‌లో ఉన్న గేట్‌వే హోటల్‌ వేదికగా ఫలితాల విడుదల కార్యక్రమం జరగనుంది. అయితే.. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ www.results.bse.ap.gov.inలో తమ ఫలితాలను ఈజీగా చూసుకోవచ్చు. కాగా, ఏపీ పదో తరగతి పరీక్షల ఫలితాలను జూన్‌ 4న ఉదయం 11 గంటలకు విడుదల చేస్తామని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. సాంకేతిక కారణాల వల్ల విడుదల వీలు కాలేదు.

ఇక‌.. పదో తరగతి పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 6,21,799 మంది విద్యార్థులు హాజరయ్యారు. కరోనా మహమ్మారి కారణంగా ఈసారి 6 ప‌రీక్ష‌లు మాత్రమే నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక మహమ్మారి కారణంగా రెండేళ్లగా పదో తరగతి పరీక్షలను నిర్వహించలేదు. విద్యార్థులందరినీ ఉత్తీర్ణులుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది కరోనా తగ్గుముఖం పట్టడంతో ఏపీతో సహా అన్ని రాష్ట్రాల్లో పరీక్షలన్నింటినీ యథాతథంగా నిర్వహించారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/