భారత హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వానాథన్ కన్నుమూత

అధిక దిగుబడిని ఇచ్చే వరి వంగడాలను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర

MS Swaminathan, father of India’s green revolution, dies in Chennai

చెన్నైః భారత హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వానాథన్ కన్నుమూశారు. ఆయన వయసు 98 ఏళ్లు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న స్వామినాథన్ చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందతూ తుదిశ్వాస విడిచారు. ఆహార కొరతతో మన దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో అధిక దిగుబడిని ఇచ్చే వరి వంగడాలను అభివృద్ధి చేయడంలో ఆయన కీలక పాత్రను పోషించారు. ఆయన చేసిన కృషి… తక్కువ ఆదాయం కలిగిన రైతులు కూడా ఎక్కువ దిగుబడిని ఉత్పత్తి చేయడానికి దోహదపడింది.

వ్యవసాయరంగంలో స్వామినాథన్ చేసిన కృషికి గాను భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులతో సగౌరవంగా సత్కరించింది. 1987లో తొలి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ను ఆయన అందుకున్నారు. హెచ్ కే ఫిరోదియా అవార్డ్, లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అవార్డ్, ఇందిరాగాంధీ ప్రైజ్ లతో పాలు పలు అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు. 1971లో రామన్ మెగసేసె అవార్డు, 1986లో ఆల్బర్ట్ ఐన్ స్టీన్ వరల్డ్ సైన్స్ అవార్డులతో ఆయనను సత్కరించారు. 2022లో స్వామినాథన్ భార్య మీనా చనిపోయారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు సౌమ్య స్వామినాథన్, మధుర స్వామినాథన్, నిత్య స్వామినాథన్ ఉన్నారు.