సినీ కార్మికులకు గుడ్ న్యూస్ తెలిపిన నిర్మాతల మండలి

తెలుగు చిత్రసీమ కార్మికులకు నిర్మాతల మండలి గుడ్ న్యూస్ తెలిపింది. గ‌డ‌చిన 3 ఏళ్లుగా తమ వెతలను పెంచాలంటూ సినీ కార్మికులు నిర్మాతల మండలిని కోరుతూ వస్తున్నారు. ఈ స‌మస్య‌పై ప‌లుమార్లు చ‌ర్చ‌లు జ‌రిగినా ఫ‌లితం మాత్రం రాలేదు. తాజాగా బుధ‌వారం హైద‌రాబాద్‌లో నిర్మాత‌ల మండ‌లితో సినీ కార్మికుల సంఘాలు నిర్వ‌హించిన స‌మావేశంలో ఈ స‌మ‌స్య ఓ కొలిక్కి వ‌చ్చింది.

కార్మికులు కోరుతున్నట్లు 30 శాతం వేతనాలను పెంచేందుకు నిర్మాతల మండలి అంగీకరించింది. ఈ మేరకు ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులతో జరిగిన చర్చలు సఫలం కావడంతో నిర్మాతలు ఊపిరిపీల్చుకున్నారు. 30 శాతం వేతనాలు పెంచాలనే డిమాండ్‌తో కార్మికులు గతంలో చిత్రీకరణలను నిలిపివేసి ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే.

ప్రతి మూడేళ్లకోసారి వేతనాలు పెంచాల్సి ఉండగా కరోనా కారణంగా నిర్మాతలు జాప్యం చేస్తూ వచ్చారని, ఈ సారి వేతనాలు సవరించి కార్మికులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఫిల్మ్ ఫెడరేషన్ మరోసారి పట్టుపట్టింది. తమ డిమాండ్‌ను నెరవేర్చకపోతే ఈనెల 16 నుంచి సమ్మె చేస్తామని హెచ్చరించింది. దీంతో నిర్మాతల మండలి.. వేతన కమిటీ ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకొని కార్మికుల వేతనాలను 30 శాతం విడతల వారీగా పెంచాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం తో సినీ కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.